న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?

29 Nov, 2022 04:31 IST|Sakshi

కేంద్రంపై సుప్రీంకోర్టు అసంతృప్తి 

మేమే నిర్ణయం తీసుకునే పరిస్థితి తేవొద్దు

టైమ్‌లైన్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని ఆదేశం

కొలీజియం సిఫార్సులపై సంప్రదింపులొద్దని వ్యాఖ్యలు

అయినా 20 సిఫార్సులను తాజాగా తిప్పిపంపిన కేంద్రం

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌ 20న టైమ్‌లైన్‌ ప్రకటించింది.

ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ కౌల్, జస్టిస్‌ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్‌ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే.

వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది.  

ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా?
కేంద్ర న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం

కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్‌ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్‌ అడ్వొకేట్‌ వికాస్‌ సింగ్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు.

ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం
హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్‌ సౌరభ్‌ కృపాల్‌ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్‌.కృపాల్‌ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్‌ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్‌ రమణ సీజేఐగా కృపాల్‌ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు.  

మరిన్ని వార్తలు