విచారణలో ఉండగా ఆయన్ని ఎలా నియమించారు?.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

23 Nov, 2022 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల నియామకాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు.. బుధవారం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా..

నవంబర్‌ 19వ తేదీన రిటైర్డ్‌ బ్యూరోక్రాట్‌ అరుణ్‌ గోయల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. ఆయన నియామకానికి సంబంధించిన దస్త్రాలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రాన్ని ఆదేశించింది. 

జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చిన వెంటనే ఆయన్ని ఎన్నికల విభాగానికి కమిషనర్‌పై నియమించడంపై కేంద్రాన్ని సూటిగా నిలదీసింది. 

గురువారం వరకు సెక్రెటరీ లెవల్‌ ఆఫీసర్‌గా అరుణ్‌ గోయెల్‌ ఉన్నారని, శుక్రవారం ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని, ఆ వెంటనే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ బెంచ్‌కి వివరించారు. ఒకవేళ ఈసీగా ఆయనకు అవకాశం దక్కకపోయి ఉంటే.. డిసెంబర్‌లో ఆయన రిటైర్‌మెంట్‌ అయ్యే వారని తెలిపింది. ఆపై కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. నియామకం సక్రమంగా జరిగిందని చెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో.. జోక్యం చేసుకున్న బెంచ్‌.. ఏజీ వాదనను తోసిపుచ్చింది. 

రాజ్యాంగ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని.. సీఈసీగా నియమిస్తుందంటూ అసహనం వ్యక్తం చేసింది బెంచ్‌. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీ ప్రభావం నుంచి దూరంగా ఉండాలని, ప్రధాన ఎన్నికల అధికారి నియామక కమిటీలో సీజేఐను చేర్చాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పని చేయాలి. ప్రధాని లాంటి వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేంత పారదర్శకత కమిషన్‌ సభ్యుల్లో ఉండాలి అని పేర్కొంది. ఒకవైపు సీఈసీ, ఈసీల నియామక పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఆయన్ని(అరుణ్‌ గోయల్‌) ఎలా నియమించారంటూ కేంద్రాన్ని నిలదీసింది. అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను తమకు సమర్పించాలని కోరిన బెంచ్‌.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు