ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ

4 Sep, 2021 18:26 IST|Sakshi

ముంబై: వ్యాపారాల్లో విజయాలు అంత సులువుగా రావు. ఎన్నో కష్టాలు, అడ్డంకులు.. ఇలా ఎదురయ్యే ప్రతి వాటిని దాటుకుంటూ వెనకడుగు వేయక ముందుక సాగాల్సి ఉంటుంది. అలా ప్రయాణించిన ఓ పేద కుటుంబంలోని యువకుడు నేడు వేల కోట్ల కంపెనీకి సీఈవో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కేర‌ళ‌కు చెందిన ముస్తఫా పేద కుటుంబం నుంచి వ‌చ్చాడు. త‌న తండ్రి.. రోజూ కూలీ ప‌ని చేస్తే గానీ మూడు పూట‌ల తిండి దొర‌క‌ని స్థితి.

తను 6వ త‌ర‌గ‌తిలో ఫెయిల్ కావ‌డంతో చ‌దువు మానేసి కూలి పనులకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో అతని స్కూల్ టీచ‌ర్ చొర‌వ‌తో మ‌ళ్లీ స్కూల్‌కి వెళ్లే అవ‌కాశం ద‌క్కించుకోవడంతో పాటు స్కూల్‌లో టాప‌ర్‌గా నిలిచాడు. చివరికి ఉద్యోగం సంపాదించి త‌న తండ్రి చేసిన అప్పుల‌న్నింటినీ తీర్చేశాడు. అనంతరం విదేశాల్లో ఉద్యోగం చేసే అవ‌కాశం రావ‌డంతో వెళ్లాడు. జీవితం సాఫీగా సాగుతున్నా ఏదో తెలియని వెలితే ఉన్నట్లు అనిపించింది. ఉద్యోగం కన్నా బిజినెస్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఓ రోజు అతని బంధువులలో ఒకరు నాణ్యమైన ఇడ్లీ-దోశ పిండి కంపెనీని ప్రారంభించాలనే ఆలోచనను ఇచ్చారు. అది నచ్చడంతో ముస్తఫా ₹ 50,000 పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి తెలిసినవారికే వ్యాపార బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయాడు. అయితే, మూడు సంవత్సరాల తర్వాత అతను తన పూర్తి సమయాన్ని కంపెనీపై దృష్టి పెడితేనే లాభాల్లోకి వెళ్తుందని గ్రహించి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అలా పూర్తి సమయాన్ని కంపెనీ కోసం కేటాయించినప్పటికీ ఒకానొక దశలో త‌న ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వలేక కంపెనీలో షేర్‌లు ఇస్తానని మాటిచ్చాడు.

అలా 8 ఏళ్ల పాటు అతని ప్రయాణం ఎన్నో క‌ష్టాల‌ను చ‌వి చూశాక‌.. చివ‌ర‌కు త‌న కంపెనీకి ఓ పెద్ద ఇన్వెస్ట‌ర్ దొరికారు. 2000 కోట్ల రూపాయ‌ల‌ను ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీ రూపురేఖ‌లే మారిపోయాయి. కంపెనీ విస్తరించడంతో పాటు సేల్స్ కూడా పెరిగాయి. తాను చెప్పినట్లుగా అందులో ఉన్న ఉద్యోగుల‌ను ల‌క్షాధికారుల‌ను చేశాడు. ప్రస్తుతం త‌న కంపెనీలో వంద‌ల మంది ప‌నిచేస్తున్నారు.

చదవండి: వినూత్న ఉద్యోగ ప్రయత్నం.. ఉద్యోగం కావాలంటూ హోర్డింగ్‌ ఏర్పాటు, అయినా..?

మరిన్ని వార్తలు