నిన్న అమ్మాయిలు.. నేడు అబ్బాయిలు.. అక్కడ అసలేం జరుగుతోంది..

28 Apr, 2022 18:59 IST|Sakshi

చెన్నై: విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆశా దీపాలంటారు. కానీ ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్న కొన్ని వీడియోలో చూస్తుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం వేయక మానదు. ముఖ్యంగా విద్యార్థులు బస్సులో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం, టీచర్లపై దాడి చేయడం, గ్రూపులుగా ఏర్పడి గొడవలకు పాల్పడడం వంటి ఘటనలు తమిళనాడులో పెరుగుతున్నాయి. తాజాగా కొందరు విద్యార్థులు బస్టాండ్‌ వద్ద కొట్టుకున్నారు. కోయంబత్తూరు సమీపంలోని ఒండిపుదూర్‌లోని బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ పక్క గొడవ జరుగుతుండగానే మరి కొందరు జోక్యం చేసుకోవడంతో పెద్ద ఘర్షణకు దారి తీసింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇదంతా జరిగింది. విద్యార్థుల యూనిఫాం ఆధారంగా ప్రభుత్వ స్కూల్‌కు చెందినవారుగా గుర్తించారు. ఇక బుధవారం చెన్నైలోని కొత్త వాషర్‌మెన్‌పేట బస్టాండ్‌ వద్ద కాలేజీ విద్యార్థినుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో మహిళా విద్యార్థులు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. హెచ్చరించి వారిని వదిలేశారు. అయితే ఈ రెండు ఘటనలపై డీజీపీ శైలేంద్ర బాబు స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.

తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గర్తు చేసుకున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు స్తోమత లేక ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదివిస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు పాఠశాల సంపదైన చైర్లు, కుర్చీలను ఎలా ధ్వంసం చేస్తాం అని ఆయన ప్రశ్నించారు. మన భవిష్యత్తు కోసం శ్రమించే టీచర్లపై ఎందుకు దాడి చేస్తున్నారు? అని డీజీపీ ఆ వీడియోలో నిలదీశారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డవద్దని విద్యార్థులకు హితవు పలికారు.

చదవండి: సున్నం కొడుతుంటే రహస్య గది కనిపించింది.. అందులోకి వెళ్లి చూడగా..

మరిన్ని వార్తలు