కరెన్సీ నోట్లు, కలర్‌ పెన్సిల్స్‌తో బోధన

14 Sep, 2020 12:30 IST|Sakshi

గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం టీచర్‌ వినూత్న ఆలోచన

ముంబై: కరోనా కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరానికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభం నుంచి పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. కానీ నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వంటి అంశాలు చాలా ఖరీదుతో కూడుకున్నవి. ఈ క్రమంలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు తన విద్యార్థుల కోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు. కలర్‌ పెన్సిల్‌, కరెన్సీ నోట్ల జీరాక్సులతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఆ వివరాలు. ప్రల్హాద్ కాథోల్‌ పాల్ఘర్‌లోని బలివాలిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. మూడు, నాల్గవ తరగతి పిల్లలకు గణితం బోధిస్తాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌ క్లాస్‌లు బోధిద్దామంటే.. తన తరగతిలోని 44 మంది విద్యార్థుల్లో కేవలం 2 దగ్గర మాత్రమే స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ ఉంది. దాంతో ప్రల్హాద్‌ ఓ వినూత్న ఆలోచన చేశాడు. (చదవండి: మంచె ఎక్కిన ‘ఆన్‌లైన్‌’ చదువులు

కొన్ని కరెన్సీ నోట్లను జీరాక్స్‌ తీపించి... వాటిని విద్యార్థులకు పంచి పెట్టాడు ప్రల్హాద్‌. మరి కొందరికి రంగు పెన్సిల్స్‌ పంచాడు. ఈ సందర్బంగా అతడు మాట్లాడుతూ.. ‘నా విద్యార్థులు పాఠశాలను మరిచిపోకుడదని భావించాను. అందుకు ఒక వర్క్‌ షీట్‌ మీద కొన్ని లెక్కలు వేసి.. కరెన్సీ నోట్ల జీరాక్స్‌లు ఇచ్చి వాటిని పరిష్కరించాల్సిందిగా చెప్పాను. ఇలా చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల చదవులో భాగం పంచుకుంటారు. అలానే నేను ప్రతి వారం ఒక గ్రామానికి వెళ్లి నా విద్యార్థులను కలుసుకుని వారి వర్క్‌షీట్లను పరిశీలిస్తాను. అర్థం కాని సమస్యలను బోధిస్తాను. వారికి కథలు చెప్తాను. కలిసి ఆడుకుంటాం. భోజనం చేస్తాము. తిరిగి పాఠశాలలు తెరిచే వరకు ఇదే పద్దతి కొనసాగిస్తాను’ అన్నాడు ప్రల్హాద్‌. 

మరిన్ని వార్తలు