రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు

4 Feb, 2023 15:10 IST|Sakshi

చెన్నై: తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తంజావూరు, పుదుకోటై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్‌లు వెల్లడించారు. నగరంలో శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

కాగా నైరూతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం తమిళనాడులోని డెల్టా జిల్లాలైన పుదుకోటై, తిరువారూర్, నాగపట్నం, తంజావూరు జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాథపురం, తెన్‌కాశి, తిరునల్వేలి జిల్లాలపై కూడా పడింది. అలాగే, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలోనూ అనేక చోట్ల వర్షం కురిసింది. 

అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.  మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, వాయువ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది.

వాయుగుండం రూపంలో ఎదురైన గండం డెల్టా అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తిరువారూర్‌ జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి వర్షార్పణమైంది. వేల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. ఈ నష్టం పరిశీలనకు శుక్రవారం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షాలు కొనసాగాయి. అధికంగా డెల్టా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తిరువారూర్‌ జిల్లాలో 75 వేల  ఎకరాల వరి పంట దెబ్బతింది. తంజావూరు, పుదుకోటై జిల్లాల్లోని వేలాది ఎకరాలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెల్టా జిల్లాలో పెద్ద ఎత్తున వేరుశనగ పంట కూడా దెబ్బతింది. ఆయా జిల్లా అధికారులు నష్టం తీవ్రతను పరిశీలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు