‘వ్యాక్సిన్‌ స్టోరేజ్‌, సరఫరాల్లో ఇబ్బందులు’

22 Sep, 2020 14:58 IST|Sakshi

వ్యాక్సిన్‌ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది ఆరంభం నాటికి సిద్ధమవుతుందని, అయితే దేశవ్యాప్తంగా 130 కోట్ల మందికి సురక్షితంగా వ్యాక్సిన్‌ అందించడమే అతిపెద్ద సవాలని ప్రముఖ వ్యాక్సిన్‌ శాస్త్రవేత్త, వ్యాక్సిన్‌ భద్రతపై డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ సలహా కమిటీ సభ్యులు గగన్‌దీప్‌ కాంగ్‌ పేర్కొన్నారు. దేశీయంగా పలు వ్యాక్సిన్‌లు కీలక క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకోగా వాటిని అందరికీ చేర్చే సరైన వైద్య మౌలిక సదుపాయాలు దేశంలో లేవని స్పష్టం చేశారు. ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుంది, ఏ వ్యాక్సిన్‌ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే గణాంకాలు మనకు అందుబాటులో ఉంటాయని కాంగ్‌ చెప్పుకొచ్చారు.

మెరుగ్గా పనిచేసే వ్యాక్సిన్‌లు వచ్చే ఏడాది ప్రథమార్ధం నాటికి తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయని, ఆ తర్వాత పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్రస్తుతం మూడో దశలో ఉన్న వివిధ వ్యాక్సిన్లు విజయవంతమయ్యే అవకాశం 50 శాతమే ఉందని ఆమె పేర్కొన్నారు. భారత్‌లో ప్రముఖ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ల క్లినికల్‌ ట్రయల్స్‌ వివిధ దశల్లో సాగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక భారత్‌లో రష్యా వ్యాక్సిన్‌ తుది దశ పరీక్షలను నిర్వహించడంతో పాటు అనుమతులు లభించిన వెంటనే భారత్‌లో వ్యాక్సిన్‌ సరఫరాలను చేపడతామని గతవారం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌  ప్రకటించింది.

దేశీయంగా భారత్‌ బయోటెక్‌, జైడస్‌ కాడిలా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌లు రెండో దశ మానవ పరీక్షలను చేపడుతున్నాయి. జైడస్‌ కాడిలా మూడవ దశ పరీక్షల అనుమతి కోసం వేచిచూస్తోంది. మరోవైపు సమర్ధవంతమైన వ్యాక్సిన్‌ భారత్‌లో అందుబాటులోకి వచ్చినప్పటికీ సరైన నిల్వ సైకర్యాలు, సరఫరా సమస్యలు ఎదురవుతాయని కాంగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో భారీ ఇమ్యూనైజేషన్‌ చేపట్టిన అనుభవం కొరవడటం సవాల్‌గా ముందుకొస్తుందని వ్యాఖ్యానించారు.అన్ని వయసుల వారికి వ్యాధినిరోధకత కల్పించే వ్యవస్థను నిర్మించడం సంక్లిష్టమని కాంగ్‌ అన్నారు. మరోవైపు టెస్టింగ్‌ సామర్థ్యం లేకపోవడంతో కరోనా మహమ్మారి తీవ్రత వెల్లడికావడం లేదని, వేగంగా ఫలితాలను ఇచ్చే యాంటీజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా తప్పుడు రిపోర్టులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : కరోనా : కీలక దశలో నాలుగు వ్యాక్సిన్లు  

మరిన్ని వార్తలు