వయసును సూక్ష్మజీవి శాసిస్తుందా?

27 Jun, 2021 01:52 IST|Sakshi

ఏజింగ్‌ జీన్స్‌పై ఇమ్యూనిటీ ప్రభావం

ఆసక్తి కలిగిస్తున్న నూతన అధ్యయనం

మనిషి జీవితాన్ని కంటికి కనబడని సూక్ష్మజీవి నిర్దే శిస్తుందా? ఆయుఃప్రమాణాన్ని అంతర్గత రోగనిరోధకత ప్రభావితం చేస్తుందా? మైక్రోబ్స్‌ బారిన పడకుండా ఉంటే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావా? అవునంటోంది తాజా పరిశోధన.. ఆ కథేంటో చూద్దాం!

మనిషిలో రోగనిరోధకతకు, వృద్ధాప్యానికి సంబంధం ఉందనేలా నూతన అధ్యయన ఫలితాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరలాజికల్‌ డిజార్డర్స్‌ సంస్థ ఐసైన్స్‌ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయన వివరాలు ఆసక్తికలిగించేలా ఉన్నాయి. డ్రోసోఫిలా(ఫ్రూట్‌ఫ్లై) అనే కీటకంపై సంస్థ జరిపిన పరిశోధనల్లో వయసు పెరుగుదలకు సంబంధించిన 70 శాతం జన్యువులకు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా కలిగే ఇమ్యూన్‌ రెస్పాన్స్‌కు సంబంధం ఉన్నట్లు తేలింది. జీవి శరీరంలోకి బ్యాక్టీరియా లాంటి పరాయి పదార్ధాలు(యాంటిజెన్స్‌) ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజమై(ఇమ్యూన్‌ రెస్పాన్స్‌) సదరు యాంటిజెన్స్‌ను అడ్డుకుంటుందన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే ఏజింగ్‌ను ప్రేరేపించే జన్యువులు సైతం యాక్టివేట్‌ అవుతాయని నిరూపితమైంది.

రోగనిరోధకత అతి చురుకుదనం(హైపర్‌ యాక్టివ్‌ ఇమ్యూనిటీ) చూపడం వల్ల నరాలకు డ్యామేజీ కలుగుతుందని మాత్రమే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా డ్రోసోఫిలాపై జరిపిన పరిశోధనతో ఇమ్యూనిటీ, ఏజింగ్‌ జన్యువులపై ప్రభావం చూపుతుందని తెలిసింది. ‘‘చాలా రోజులుగా ఏజింగ్‌ జీన్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి జీవిలో ఈ జీన్స్‌ కారణంగా వృద్ధాప్యం సంభవిస్తుంది. మా పరిశోధనలో ఈ జీన్స్‌లో 30 శాతం మాత్రమే సహజసిద్ధంగా ఏజింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకుంటాయని, 70 శాతం ఏజింగ్‌ జీన్స్‌ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌తో యాక్టివేట్‌ అవుతాయని తెలిసింది.’’అని సీనియర్‌ సైంటిస్టు డా.ఎడ్వర్డ్‌ జినిజెర్‌ చెప్పారు. వయసు ప్రభావిత సమస్యలపై జరిగే మెడికల్‌ రిసెర్చ్‌లకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు.  

ఎలా కనుగొన్నారు?
తాజాగా జన్మించిన కొన్ని డ్రోసోఫిలా కీటకాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు ఈగలను బ్యాక్టీరియా చొరబడలేని వాతావరణంలో యాంటీబయాటిక్స్‌ మధ్య పెంచారు. రెండో గ్రూపును సాధారణ వాతావరణంలో పెంచారు. వీటిలో బ్యాక్టీరియా బారిన పడని ఈగలు 63 రోజులు బతికితే, సహజ వాతావరణంలో బ్యాక్టీరియాకు గురైన ఈగలు 57 రోజులు మాత్రమే బతికాయి. దీంతో ఏజింగ్‌ జీన్స్‌ను ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రభావితం చేస్తుందని, యాంటీబయాటిక్స్‌ వాడకం కారణంగా ఏజింగ్‌ జీన్స్‌ యాక్టివిటీ మందగించిందని నిర్ధారణకు వచ్చారు.

ఈగల్లో 6 రోజుల జీవిత కాలం తేడా అంటే మానవుల్లో సుమారు 20 సంవత్సరాలకు సమానమని పరిశోధనలో పాల్గొన్న మరో సైంటిస్టు డా. అరవింద్‌ కుమార్‌ శుక్లా వివరించారు. అలాగే వీటిలో కొన్ని జన్యువులు శరీరాంతర్గత గడియారం(బయలాజికల్‌ క్లాక్‌)ను నియంత్రిస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే కచ్ఛితంగా వీటిలో ఏ జీన్స్‌ పూర్తిగా ఏజింగ్‌ ప్రక్రియకు కారణమనేది తెలియరాలేదని, దీనిపై మరింత పరిశోధన జరగాలని చెప్పారు. ఇమ్యూనిటీతో పాటు జీవక్రియలు, ఒత్తిడి తదితరాలపై కూడా మైక్రోబయోమె(శరీరంలో నివసించే అన్ని సూక్ష్మక్రిముల మొత్తం జన్యుపదార్థం) ప్రభావితం చేయగలవన్నారు.

మరిన్ని వార్తలు