కోవిడ్‌-19 : యాంటీబాడీలు పూర్తిగా రక్షణ ఇవ్వవు

7 Sep, 2020 19:14 IST|Sakshi

యాంటీబాడీల మోతాదుపై కొరవడిన ఏకాభిప్రాయం

సాక్షి, న్యూఢిల్లీ : శరీరంలో యాంటీబాడీల ఉనికితో వ్యక్తులు గతంలో కోవిడ్‌-19 బారినపడిన విషయం తెలిసినా కరోనా వైరస్‌ నుంచి ఇవి ఎప్పటికీ పూర్తి రక్షణ ఇవ్వలేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. యాంటీ బాడీల రకాలతో పాటు అవి ఎంత పరిమాణంలో తయారయ్యాయి..ఎంతకాలం మనగలుగుతాయనే వైరుధ్యాలే ఇందుకు కారణమని తెలిపారు. వ్యక్తి శరీరంలో ఉండే యాంటీబాడీలు వ్యాధి పురోగతి గురించి ఏమీ చెప్పవని న్యూఢిల్లీకి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌ పేర్కొన్నారు. శరీరంలో తటస్థీకరించే యాంటీబాడీస్‌ (న్యూట్రలైజింగ్‌), సాధారణ యాంటీబాడీస్‌ ఉంటాయని, న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ కణాల్లోకి కరోనా వైరస్‌ రాకను అడ్డుకునే వ్యవస్థను ప్రేరేపిస్తాయని పూణేకు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ఎడ్యుకేషన్‌, రీసెర్చి (ఐఐఎస్‌ఈఆర్‌) శాస్త్రవేత్త వినీతా బాల్‌ తెలిపారు.

సాధారణ యాంటీబాడీలు వైరస్‌ ఉనికికి స్పందించే  సంకేతాలు పంపినా, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాత్రం ఉపయోగపడవని ఆమె వివరించారు. వ్యక్తి శరీరంలో యాంటీబాడీల ఉనికి కేవలం గతంలో కోవిడ్‌-19 సోకిందని గుర్తించేందుకు ఉపయోగపడినా న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు లేకుంటే అవి వ్యాధి నుంచి పూర్తి రక్షణ ఇవ్వని ఇమ్యూనాలజిస్ట్‌ తెలిపారు. న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు తగిన సంఖ్యలో ఎక్కువ కాలం ఉంటేనే తదుపరి వైరస్‌ దాడిని ఎదుర్కోగలరని వివరించారు. ఏ స్ధాయిలో న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు ఉంటే ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చనే దానిపై ఏకాభిప్రాయం లేదని చెప్పారు. చదవండి : ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం

మరిన్ని వార్తలు