సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజాపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన..

10 Mar, 2023 19:36 IST|Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించిన తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఇండిగ్రేటెడ్ సర్వైలెన్స్  ప్రోగ్రామ్‌(ఐడీఎస్పీ) ద్వారా సీజనల్ ఫ్లూ పరిస్థితిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. వాస్తవ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఎంతమంది అనారోగ్యం బారినపడుతున్నారు, ఎంత మంది మరణిస్తున్నారో కూడా ట్రాకింగ్ చేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ఈ ఫ్లూ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న పిల్లలు, వృద్ధులు ఎక్కువ ప్రభావితం అవుతున్నట్లు తెలిపింది. హెచ్‌3ఎన్‌2 కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది.

అయితే ఈ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. మార్చి చివరి నాటికి కేసుల్లో తగ్గుదల నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90 హెచ్‌3ఎన్‌2 కేసులు వెలుగుచూశాయి. 8 హెచ్‌1ఎన్‌1 కేసులు నమోదయ్యాయి. గొత కొద్దినెలలుగా ఈ కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. 'హాంగ్ కాంగ్ ఫ్లూ'గా పేరున్న ఈ హెచ్‌3ఎన్‌2 వైరస్ వల్ల ఇతర ఫ్లూలతో పోల్చితే ఆస్పత్రిలో చేరాల్సిన ముప్పు అధికంగా ఉంటుంది.
చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? ఇదిగో డాక్టర్ల క్లారిటీ..!

మరిన్ని వార్తలు