Monkeypox: భారత్‌లో మంకీపాక్స్‌ కలకలం.. కేరళలో రెండో కేసు నమోదు..

18 Jul, 2022 16:13 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదైంది. దుబాయ్‌ నుంచి వచ్చిన కన్నూర్‌ జిల్లాకు చెందిన 31 వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ సోమవారం వెల్లడించారు. వైరస్‌ సోకిన వ్యక్తి ప్రస్తుతం పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని, అతని  ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారిపై నిఘా ఉంచామని, కొందని నమూనాలను టెస్ట్‌లకు పంపినట్లు పేర్కొన్నారు. ‍కాగా భారత్‌లో మంకీపాక్స్‌ తొలికేసు కూడా కేరళలోనే నమోదైన విషయం తెలిసిందే.

దేశంలో మంకీపాక్స్‌ వెలుగుచూసిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. మరోవైపు రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండే దిశగా కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అయిదు జిల్లాలకు (తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్టా, అలప్పుజా, కొట్టాయం) ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రయాణించిన విమానంలో చాలామంది ప్రయాణికులు ఈ ప్రాంతానికి చెందినవారే. ఆ ప్రయాణికులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లక్షణాలు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్‌ ప్రస్తుతం భారత్‌ను భయపెడుతోంది. యూరప్‌ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రాణాంతక వైరస్‌ భారత్‌లోనూ అలజడి సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ మంకీపాక్స్‌ భారత్‌ సహా 50 దేశాలకు విస్తరించింది. దీని కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా.. జంతువుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

మరిన్ని వార్తలు