ఆ సమస్య కరోనా సెకండ్‌వేవ్‌లో ఎక్కువే..!

20 Apr, 2021 02:41 IST|Sakshi
బలరాం భార్గవ

వయోధికులకు కరోనా ముప్పు అధికం

70 శాతం మంది బాధితులు 40 ఏళ్లు దాటినవారే  

ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌–19 మహమ్మారి బారినపడిన బాధితుల్లో 70కిపైగా శాతం మంది 40 ఏళ్ల వయసు దాటినవారే. మొదటి వేవ్, ప్రస్తుతం కొనసాగుతున్న రెండో వేవ్‌లో అత్యధిక శాతం మంది బాధితులు వయోధికులే కావడం గమనార్హం. ఎక్కువ వయసున్న వారికి కరోనా సులభంగా సోకుతోందని, వారు ఈ వైరస్‌ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. కరోనా సోకి, పరిస్థితి విషమించి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా సంభవించిన మరణాల విషయంలో మొదటి వేవ్‌కు, రెండో వేవ్‌కు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తెలిపారు. కానీ, మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరం మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో అధికంగా ఉందని వెల్లడించారు.

ఫస్ట్‌ వేవ్‌లో 41.5 మంది బాధితులకు ఆక్సిజన్‌ అవసరం కాగా, సెకండ్‌ వేవ్‌లో 54.5 శాతం మందికి అవసరమవుతోందని చెప్పారు. వెంటిలేటర్‌ అవసరం మాత్రం తక్కువగానే ఉందన్నారు. కరోనా సోకితే ఊపిరి అందకపోవడం అనే సమస్య సెకండ్‌ వేవ్‌లో స్వల్పంగా పెరిగిందన్నారు. గొంతు నొప్పి, పొడి దగ్గు తదితర ఇతర లక్షణాలు ఫస్ట్‌ వేవ్‌లోనే ఎక్కువగా కనిపించాయని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు కనిపించని బాధితులు రెండో వేవ్‌లోనే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫస్ట్‌ వేవ్‌లో 7,600 మందిపై, సెకండ్‌ వేవ్‌లో 1,885 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించామన్నారు.  చదవండి: (లాక్‌డౌన్‌ భయం.. విచ్చలవిడిగా షాపింగ్‌)

యువతకు కరోనా ముప్పు విషయంలో రెండు వేవ్‌ల మధ్య పెద్దగా తేడా లేదని నీతి ఆయోగ్‌(హెల్త్‌) సభ్యుడు వి.కె.పాల్‌ చెప్పారు. మొదటి వేవ్‌ బాధితుల్లో 31 శాతం మంది 30 ఏళ్లలోపు వారని, రెండో వేవ్‌ బాధితుల్లో 32 శాతం మంది 30 ఏళ్లలోపు వారని వెల్లడించారు. ఇళ్లల్లోనే ఉంటూ కరోనా చికిత్స పొందుతున్నవారికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అవసరం లేదన్నారు. ఆసుపత్రిలో చేరి, ఆక్సిజన్‌పై ఉన్నవారికి మాత్రమే ఈ ఇంజక్షన్‌ ఇవ్వాలని సూచించారు.    

చదవండి: (పరిస్థితి భయానకం.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి)

మరిన్ని వార్తలు