రహస్యంగా మాల్యా అప్పగింత ప్రక్రియ : కేంద్రం 

6 Oct, 2020 08:16 IST|Sakshi

మాల్యా అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది : సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం 

సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న మాజీ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అప్పగించే ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఈ అంశంలో తాజా పరిస్థితి గురించి తెలియదని.. ఇందులో తాము ఒక పక్షంగా లేమని స్పష్టం చేసింది. అప్పగించే విషయంలో రహస్యంగా కొనసాగుతున్న ప్రక్రియలు ఏంటనేవి తమకు తెలియజేయాలని మాల్యా తరఫు న్యాయవాది అంకుర్‌సైగల్‌ను జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది.

మాల్యా న్యాయవాది సైతం ఈప్రక్రియలపై తనకు అవగాహన లేదని చెప్పారు. అప్పగింతకు వ్యతిరేకంగా చేసుకున్న అభ్యర్థనను తిరస్కరించిన విషయమే తనకు తెలుసన్నారు. దీంతో మాల్యా అప్పగింత ప్రక్రియ ముగియనున్న నవంబర్‌ 2 నాటికి ఈ వివరాలు తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్‌ డాలర్లను బదిలీ చేయగా.. దీన్ని నేరంగా కోర్టు గతంలో ప్రకటించింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ అక్టోబర్‌ 5న తమ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశాలు జారీ చేసింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తరఫున తీసుకున్న రూ.9,000 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి మాల్యా కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో తలదాచుకున్నారు.

మరిన్ని వార్తలు