ముంబైలో 16 నుంచి మీటింగ్‌లు, ఊరేగింపులు నిషేధం.. నలుగురి కంటే ఎక్కువ గుమిగూడారంటే!

14 Oct, 2022 19:05 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముంబై, తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో ముంబైకర్లు ఒకచోట నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి గుంపుగా ఉండరాదు. గుంపులుగా ఉంటే పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారు.

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి తోడు శివసేనకు అసలు వారసులం మేమేనని, మాకే సంఖ్యా బలం ఎక్కువ ఉందని, అందుకు పార్టీ గుర్తు విల్లు–బాణం (ధనుశ్య–బాణ్‌) తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, అటు ఏక్‌నాథ్‌ శిందే వర్గం మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం తాజాగా ఉండగానే రమేశ్‌ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో నవంబర్‌ మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో కూడా శిందే వర్గం తలదూర్చనుంది. ఠాక్రే వర్గం, శిందే వర్గం పరస్పరంగా ఎదురుపడితే ఘర్షణ జరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది.  

పోటాపోటీగా ఇరువర్గాలు... 
ఈ నెల 24 నుంచి దీపావళి పర్వదిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలకు కానుకలు, నూతన సంవత్సర క్యాలండర్లు పంపిణీ చేయడం లాంటి పనులతో వారితో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు ఇరు పార్టీలూ పోటాపోటీగా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ప్రజావ్యవస్ధలో నెలకొన్న ప్రశాంతతను దెబ్బతీసి ప్రాణ, ఆస్తి నష్టం జరిగేలా కొన్ని ఆసాంఘిక దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నగరం, ఉప నగరాల్లో 144 సెక్షన్‌ అమలు చేయాలని ముంబై పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 15 రోజులపాటు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, నియమాలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ లాట్కర్‌ స్పష్టం చేశారు.
చదవండి: కారులో ప్రయాణిస్తే అది తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్‌!

నిబంధనల్లో భాగంగా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నలుగురికంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదు. అదేవిధంగా నగరంలో ఎలాంటి ఊరేగింపులు, లౌడ్‌స్పీకర్లు, బ్యాండ్, ఇతర వాయిద్యాలు వినియోగించకూడదు. బాణసంచా పేల్చడం లాంటి పనులపై సైతం నిషేధం వి«ధించినట్లు సంజయ్‌ తెలిపారు. పరిస్ధితులు ఇలాగే ఉంటే ఉంటే గడువు ముగిసిన తరువాత కూడా వీటిపై నిఘా ఉంటుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘించే వారికి జరిమానా లేదా జైలు శిక్ష, వాయిద్య సామాగ్రి జప్తు చేస్తామని హెచ్చరించారు.

అదేవిధంగా దీపావళి పర్వదినం సందర్భంగా అనేక మంది భవనాల టెర్రస్‌ల పైనుంచి, సముద్ర తీరాల నుంచి ఆకాశంలోకి పెద్ద సంఖ్యలో కందిళ్లను (చుక్కలను) ఎగురవేస్తారు. వీటిపై కూడా నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. టపాసులు, దీపెంతలు, విద్యుత్‌ తోరణాలు తదితర ప్రమాదకర చైనా తయారీ వస్తువులు, కందిళ్లు నిల్వచేసే వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

144 సెక్షన్‌ అమలు ఉన్న రోజుల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు, అంత్యక్రియల శోక సభలు, అలాగే కార్యాలయాలు, క్లబ్బులు, సొసైటీ ఆవరణలో, నాట్యగృహాలు, హాలులో, ఫ్యాక్టరీలు, షాపులు, సాధారణ వ్యాపారులు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో జరిగే సభలు, సమావేశాలకు మినహాయింపు ఉంటుందన్నారు. అయితే ముందస్తుగా స్ధానిక పోలీసు స్టేసన్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్‌ సంజయ్‌ లాట్కర్‌ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు