కర్నాల్‌లో నిషేధాజ్ఞలు మొబైల్‌ ఇంటర్నెట్‌ నిలిపివేత

7 Sep, 2021 06:30 IST|Sakshi

కర్నాల్‌(హరియాణా): హరియాణాలోని కర్నాల్‌లో మినీ సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామన్న రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నిర్వహిం చతలపెట్టిన రైతు ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో 144వ సెక్షన్‌ అమల్లోకి తెచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ప్రకటించింది. మొబైల్‌ ఇంటర్నెట్‌నూ నిలిపేశారు. కర్నాల్‌లో నలుగురుకి మించి వ్యక్తులు గుమిగూడటం కుదరదంటూ నిషేధాజ్ఞలు జారీచేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తు చర్యగా ఆంక్షలు అమల్లోకి తెచ్చామని  అదనపు డీజీపీ(లా అండ్‌ ఆర్డర్‌) నవ్‌దీప్‌ సింగ్‌ చెప్పారు. రైతు ఆందోళన సందర్భంగా తప్పుడు వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయకుండా ఆపేందుకు కర్నాల్‌ జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఎంఎస్, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సేవలను స్తంభింపజేస్తారు.

పొరుగున ఉన్న కురుక్షేత్ర, కైథాల్, జింద్, పానిపట్‌ జిల్లాల్లోనూ ఈ సేవలనుæ నిలిపేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలనూ రప్పించారు. గత నెల 28న కర్నాల్‌లో బీజేపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయల్దేరిన రైతులు.. జాతీయరహదారి వెంట ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్నారంటూ వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో 10 మందికిపైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించారు. లాఠీచార్జి కారణంగా ఆయన మరణించారని రైతు సంఘాలు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. లాఠీ చార్జిని  నిరసిస్తూ మినీ–సెక్రటేరియట్‌ను ముట్టడి స్తామని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ప్రకటించడం తెల్సిందే. ముందుగా కర్నాల్‌లో భారీస్థాయిలో పంచాయత్‌ను నిర్వహిస్తామని, తర్వాత మినీ– సెక్రటేరియట్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తామని హరియాణా భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గుర్నామ్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు