పెట్రో బాంబు దాడుల కలకలం.. బీజేపీ నేతల ఇళ్లకు భద్రత పెంపు!

24 Sep, 2022 07:16 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో బీజేపీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలకు పోలీసులు భద్రతను పెంచారు. చెన్నైలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయం వద్ద, పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. డీఎంకే ఎంపీ రాజ హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. 

అదే సమయంలో రాజను బెదిరించే విధంగా బీజేపీ, హిందూ సంఘాలు మాటల తూటాలను పేల్చడంతో పోలీసులు కేసుల నమోదుపై దృష్టి పెట్టారు. బీజేపీ నేతలపై పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి కోయంబత్తూరు జిల్లాలో పలు చోట్ల బీజేపీ నేతలను టార్గెట్‌ చేసి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రో బాంబులతో దాడి చేయడం కలకలం రేపింది. బీజేపీ నేతలు రత్నకుమార్, కుమార్, శివ, పొన్‌రాజ్‌ తదితరలను, వారి ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాలపై ఈ దాడులు జరగడంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ బీజేపీ వర్గాలు ఆందోళనలు చేపట్టాయి. 

భద్రత పెంపు..
పెట్రో బాంబు దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం కోసం కోయంబత్తూరులో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. శుక్రవారం ఉదయం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాల వద్ద భద్రతను పోలీసుల పెంచారు. ముఖ్య నాయకులకు భద్రత కల్పించారు. చెన్నైలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయం వద్ద సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ పరిసర మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.   

మరిన్ని వార్తలు