దేశద్రోహ చట్టంపై స్టే

12 May, 2022 04:32 IST|Sakshi

సుప్రీంకోర్టు నిర్ణయం

కేసులపై విచారణ ఆపాలి

కొత్తగా కేసులు పెట్టొద్దు

కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశం

పునఃసమీక్షకు అనుమతి

న్యూఢిల్లీ: బ్రిటిష్‌ జమానా నాటి దేశద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం వెలువరించింది. చట్టం అమలుపై స్టే విధించింది. కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల విచారణ కూడా నిలిపేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ ఆదేశాలు తమ తదుపరి ఉత్తర్వుల దాకా కొనసాగుతాయని పేర్కొంది. దీనిపై జూలై మూడో వారంలో తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. ‘‘ఆలోపు దేశద్రోహ చట్టం కింద కొత్త కేసులు పెట్టడం వంటివి జరిగితే బాధితులు సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చు. మా ప్రస్తుత ఆదేశాలకు అనుగుణంగా ఆయా కోర్టులకు వారికి తగిన ఊరట కల్పించాలి’’ అని సూచించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీ కూడా ఉన్నారు.

ఈ కాలానికి నప్పదు
‘‘దేశద్రోహ చట్టం (124ఏ) ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదు. దేశ భద్రతకు, సమగ్రతకు సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన కూడా అర్థం చేసుకోదగినదే. కానీ ప్రభుత్వ ప్రయోజనాలు, పౌరుల ప్రయోజనాల మధ్య సమతుల్యత అవసరం. కష్టమే అయినా దాన్ని సాధించడం తప్పనిసరి’’ అంటూ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం పునఃసమీక్షకు కేంద్రానికి అనుమతిస్తున్నట్టు పేర్కొంది.

‘‘ఆలోపు కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ దేశద్రోహ చట్టం కింద ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లూ నమోదు చేయవని, ఇప్పటికే నమోదైన కేసుల్లో విచారణ కొనసాగించబోవని ఆశిస్తున్నాం. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును గత విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ మా ముందుంచారు. హనుమాన్‌ చాలీసా కేసు వంటి పలు ఉదాహరణలను మా దృష్టికి తెచ్చారు. అందుకే పునఃసమీక్ష ముగిసేదాకా ఈ చట్టాన్ని ప్రయోగించకుండా ఉండటమే సరైందని భావిస్తున్నాం’’ అని జస్టిస్‌ రమణ తన తీర్పులో పేర్కొన్నారు.

చట్టంపై స్టే విధించే బదులు దేశద్రోహ చట్టం కింద నమోదైన కేసుల విచారణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఎస్పీ ర్యాంకు పోలీసు అధికారిని నియమించాలని కేంద్రం సూచించగా ధర్మాసనం అంగీకరించలేదు. ఇది కేసు పెట్టదగిన నేరాలకు సంబంధించిన చట్టం గనుక దాని కింద ఎఫ్‌ఐఆర్‌ల నమోదును నిరోధించలేమని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభిప్రాయపడ్డారు.

1962లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా దేశద్రోహ చట్టాన్ని సమర్థించిందని గుర్తు చేశారు. కేంద్రం లేవనెత్తిన ఈ అంశంపై సంప్రదింపుల నిమిత్తం విచారణను ధర్మాసనం కాసేపు నిలిపేసింది. అనంతరం తిరిగి విచారణ చేపట్టింది. ‘‘కేంద్రం లేవనెత్తిన అంశాన్ని కూలంకషంగా పరిశీలించాం. సదరు చట్టాన్ని (సుప్రీంకోర్టు వంటి) సాధికార ఫోరం సమీక్షించవచ్చని కేంద్రం కూడా నాటి విచారణ సందర్భంగా అంగీకరించింది’’ అని వ్యాఖ్యానించింది.

అన్ని అంశాలనూ లోతుగా పరిశీలించిన తర్వాతే దేశద్రోహ చట్టం అమలుపై స్టే విధించాలని నిర్ణయానికి వచ్చినట్టు వివరించింది. ఇతరత్రా కూడా ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిందిగా రాష్ట్రాలకు సూచనలిచ్చేందుకు కేంద్రానికి అనుమతిచ్చింది. 10 పేజీల తీర్పును జస్టిస్‌ రమణ రాశారు. ప్రధాని మోదీ కూడా ఇటీవల దేశద్రోహ చట్టాన్ని ప్రస్తావిస్తూ, ‘పౌర స్వేచ్ఛను, మానవ హక్కులను పరిరక్షించాల్సిన అవసరముంది’ అని వ్యాఖ్యానించారని తీర్పులో ఆయన ప్రస్తావించారు.

స్టే సరికాదు: కేంద్రం
దేశద్రోహ చట్టంపై పునఃసమీక్ష జరిగేదాకా కేసుల విచారణను, దానికింద కొత్త కేసుల నమోదును నిలిపేస్తారా అని మంగళవారం విచారణ సందర్భంగా కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించడం, 24 గంటల్లోగా వైఖరి తెలిపాలని పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం అభిప్రాయాలతో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి అఫిడవిట్‌ సమర్పించారు. స్టే విధింపుకు కేంద్రం వ్యతిరేకమని తెలిపారు.

ఈ చట్టం కింద పెండింగులో ఉన్న కేసుల్లో బెయిల్‌ అభ్యర్థనలను ఆరోపణల తీవ్రతకు అనుగుణంగా వీలైనంత త్వరగా పరిష్కరించవచ్చన్నది కేంద్రం ఉద్దేశమన్నారు. ‘‘ఎందుకంటే ఆ కేసుల్లో ఉగ్రవాద, మనీ లాండరింగ్‌ వంటి కోణాలు కూడా ఇమిడి ఉండొచ్చు. ఏమైనా దేశద్రోహ చట్టం కింద పెండింగ్‌ కేసులన్నీ కోర్టుల ముందే ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానాలపై నమ్మకముంచాలి’’ అని మెహతా వ్యాఖ్యానించారు.  

లక్ష్మణరేఖ దాటొద్దు: కేంద్ర న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు
న్యూఢిల్లీ: రాజ్యాంగ వ్యవస్థలు లక్ష్మణరేఖ దాటకూడదని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు అభిప్రాయపడ్డారు. దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై బుధవారం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులు ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థను గౌరవించాలి. ప్రభుత్వం కూడా కోర్టులను గౌరవించాలి.

ఈ మేరకు స్పష్టమైన లక్ష్మణరేఖను రాజ్యాంగం ఎప్పుడో నిర్దేశించి ఉంచింది. దాన్ని ఎవరూ మీరకూడదు’’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలగని రీతిలో దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పారు. దీన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. చట్టాలు చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు.

పార్టీల స్పందనలు
సత్యం కోసం నినదించే గళాలను ఎంతోకాలం తొక్కిపెట్టలేరని సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మరోసారి రుజువైంది. నిజం చెప్పడం దేశభక్తే తప్ప దేశద్రోహం కాదు. వాస్తవాలను చెవికెక్కించుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ప్రశ్నించే గొంతుకలను అణిచేయడం అహంకారం.
– కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ

దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామన్న కేంద్రం సూచనకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 1,500కు పైగా కాలం చెల్లిన చట్టాలను మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా రద్దు చేసింది.
– బీజేపీ అధికార ప్రతినిధి నళిన్‌ కోహ్లీ

దేశంలో విభజన తీసుకొచ్చేందుకు 2014 నుంచీ దేశద్రోహ చట్టాన్ని మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోంది. అందుకే కేంద్ర పునఃసమీక్ష దాకా ఆగకుండా దాన్ని సుప్రీంకోర్టే పూర్తిగా రద్దు చేయాలి
– సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

సుప్రీం ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. దేశద్రోహ చట్టం రద్దు కోసం 2011లోనే రాజ్యసభలో ప్రైవేట్‌ సభ్యుల బిల్లు పెట్టాం
– సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

మోదీ సర్కారుపై గళమెత్తిన వారందరిపైనా దేశద్రోహ చట్టం ప్రయోగిస్తున్నారు. ఈ పోకడకు సుప్రీంకోర్టు  చెక్‌ పెట్టింది
– ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్‌  
 

చదవండి👉Bangalore: కోటి వాహనాల ఐటీ సిటీ

మరిన్ని వార్తలు