సెకండ్‌ వేవ్‌: చిన్నారులపై పంజా.. తల్లిదండ్రుల్లో ఆందోళన

26 Apr, 2021 02:38 IST|Sakshi

సెకండ్‌ వేవ్‌లో చిన్నారులపై పంజా  

ఆందోళనలో తల్లిదండ్రులు 

జాగ్రత్తలు తప్పవంటున్న నిపుణులు  

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో పిల్లల్నీ విడిచిపెట్టడం లేదు. ఎక్కువగా ప్రీ టీన్స్‌లో ఉన్న చిన్నారులపై దాడి చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు చెబుతున్న జాగ్రత్తలేంటి?  

కరోనా సెకండ్‌ వేవ్‌లో చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన పెంచుతోంది. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఎక్కువగా కరోనా దాడి చేస్తోంది. 1–8 మధ్య వయసున్న వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. 

ఫస్ట్‌ వేవ్‌లో లక్షణాలు లేకుండా...  
గత ఏడాది కూడా పిల్లలకి కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు లేకపోవడంతో దానికి సంబంధించిన వార్తలు పెద్దగా బయటకి రాలేదు. కరోనా వారికి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలిసే అవకాశం లేదని అపోలో ఆస్పత్రిలో పీడియాట్రిషన్‌ డాక్టర్‌ అంజన్‌ భట్టాచార్య తెలిపారు. ‘గత ఏడాది చిన్నపిల్లల్లో 1 శాతం మందికి కరోనా సోకితే, ఈ సారి 1.2 శాతం మందికి సోకింది. శాతాల్లో చూస్తే తక్కువగానే కనిపించినా సంఖ్యలో ఇది చాలా ఎక్కువ. ప్రభ్వుత్వం పిల్లల్లో కరోనాకి సంబంధించి ఎలాంటి అధికారిక గణాంకాలు విడుదల చేయడం లేదు’’ అని ఆయన వెల్లడించారు. 

డబుల్‌ మ్యూటెంట్‌ కారణమా?  
కరోనా సెకండ్‌ వేవ్‌లో పిల్లలకి కరోనా సోకడానికి డబుల్‌ మ్యూటెంట్‌ కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ వైరస్‌కి త్వరగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటుగా రోగనిరోధక వ్యవస్థని నిర్వీర్యం చేసే సామర్థ్యం కూడా ఉంది. దీంతో పిల్లల్లో ఈ వైరస్‌ సులభంగా సోకుతోంది. కరోనా తగ్గిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల్లో వచ్చే ఎంఐఎస్‌సి (మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌) వ్యాధితో ఎక్కువ మంది పిల్లలు తమ దగ్గరకి వస్తున్నట్టుగా కోల్‌కతాకు చెందిన పీడియాట్రిషన్‌ డాక్టర్‌ జయదేవ్‌ రే చెప్పారు. అంతేకాకుండా కోవిడ్‌ సోకిన పిల్లల్లో 40–50 శాతం మంది గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడుతున్నట్టుగా రే వెల్లడించారు.

పిల్లలకు ఇంకా వ్యాక్సిన్‌ లేదు 
పిల్లల్లో ఇప్పటివరకు పెద్ద కంపెనీలేవీ వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఇంకా జరపలేదు. గత వారం అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్‌ తమ వ్యాక్సిన్‌ 12–15 ఏళ్ల వయసు వారిపై బాగా పని చేస్తుందని వెల్లడించింది. హైదరాబాద్‌కి చెందిన భారత్‌ బయోటెక్‌ 5 నుంచి 18 ఏళ్ల మధ్య వారిపై ప్రయోగాలు జరపడానికి అనుమతి కోరినప్పటికీ తగినంత గణాంకాలు (డేటా) సమర్పించకపోవడంతో కేంద్రం అనుమతి నిరాకరించింది. మరోవైపు అమెరికాలో అత్యధికంగా 13 శాతం మంది పిల్లలు కరోనా బారినపడటంతో ఆ దేశం కూడా చిన్నారులకి వ్యాక్సిన్‌ ప్రయోగాలు మొదలు పెట్టే యోచనలో ఉంది. యూకే, ఇజ్రాయెల్‌ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. 
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

చిన్నారుల్లో కోవిడ్‌ లక్షణాలు 
గ్యాస్ట్రిక్‌ సమస్యలు
ఆకలి మందగించడం 
వాంతులు, విరోచనాలు
ఒళ్లంతా దద్దుర్లు 
కళ్లు ఎర్రబారడం
జ్వరం, పొడి దగ్గు 
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
భౌతిక దూరం పాటించాలి 
ఆడుకోవడానికి బయటకి వెళ్లనివ్వకూడదు, ఇండోర్‌ గేమ్స్‌కే ప్రాధాన్యతనివ్వాలి 
స్నేహితులతో వీడియో కాల్స్‌ ద్వారా మాత్రమే మాట్లాడనివ్వాలి 
తప్పనిసరిగా మాస్కు ధరించాలి 
ముక్కు, ముఖంతో పాటు కళ్లపైకి కూడా చెయ్యి వెళ్లకుండా చూసుకోవాలి. కళ్ల ద్వారా ఎక్కువగా వైరస్‌ సోకే అవకాశాలున్నాయి.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు