కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!

5 Oct, 2020 17:04 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ మరణంలో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వెల్లడించిన నివేదికపై శివసేన సోమవారం స్పందించింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల ప్రతిష్ట దిగజార్చిన రాజకీయ నేతలు, వార్తా ఛానెళ్లు మహారాష్ట్రకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. సుశాంత్‌ కేసులో చివరికి సత్యం వెలుగుచూసిందని, ఈ ఉదంతంలో మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర జరిగిందని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ఆరోపించింది. ఈ కుట్రలో పాలుపంచుకున్న వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం పరువునష్టం దావా వేయాలని సూచించింది. సుశాంత్‌ మృతిపై ఎయిమ్స్‌ నివేదికను మూఢ భక్తులు వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించింది. సుశాంత్‌ కేసుపై కుక్కల్లా మొరిగి, ముంబై పోలీసులను అనుమానించిన రాజకీయ నేతలు, వార్తాఛానెళ్లు ఇప్పుడు మహారాష్ట్రకు క్షమాపణలు చెప్పాలని శివసేన కోరింది.

యూపీలోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక లైంగిక దాడిపై నోరుమెదపని వారు మహారాష్ట్ర నిబద్ధతను ప్రశ్నించలేరని ఆక్షేపించింది. సుశాంత్‌ కేసు దర్యాప్తులో విలువలు, గోప్యతను కాపాడేలా ముంబై పోలీసులు వ్యవహరించారని, అదే సీబీఐ నటుడి డ్రగ్స్‌ కేసును 24 గంటల దర్యాప్తులోనే తవ్వితీసిందని పేర్కొంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి ఎలాంటి అంశాలు లేకపోవడంతో సుశాంత్‌ కేసును బిహార్‌ నేతలు లేవనెత్తారని శివసేన దుయ్యబట్టింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసుపై రాద్ధాంతం చేసి ముంబైని పీఓకేతో పోల్చిన నటి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని కంగనా రనౌత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. యూపీలోని హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనపై ఆ నటి కనీసం రెండు కన్నీటి చుక్కలు కార్చలేదని ఆరోపించింది. చదవండి : సుశాంత్‌ది ఆత్మహత్యే: ఎయిమ్స్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు