అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత

26 Nov, 2020 04:13 IST|Sakshi

కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరు

నమ్మకస్తుణ్ని కోల్పోయాం: సోనియా  

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌నేత, వ్యూహకర్త అహ్మద్‌పటేల్‌(71) గుర్‌గావ్‌లో కన్నుమూశారు. నెలరోజులుగా ఆయన కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను ఈ నెల 15న ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు అవయవాలు స్పందించని కారణంగా బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించినట్లు ఆయన కుమారుడు ఫైజల్‌ తెలిపారు. çపటేల్‌ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత సోనియా, రాహుల్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

ప్రస్తుతం పటేల్‌ గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మూడు దఫాలుగా పటేల్‌ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వగ్రామం పిరమన్‌లో పటేల్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. ‘కాంగ్రెస్‌పార్టీకి జీవితాన్ని అంకింతం చేసిన ఒక కీలక నేతను కోల్పోయాము. భర్తీ చేయలేని ఒక సహచరుడు, నమ్మకస్తుడు, స్నేహితుడిని కోల్పోయాను’ అని కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఆపదలు దాటించే అహ్మద్‌ భాయ్‌
స్నేహితులు ‘ఏపీ’ లేదా ‘బాబూ భాయ్‌’అని పిలుచుకునే అహ్మద్‌ పటేల్‌ సోనియాకు 2001 నుంచి రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఆపద వస్తే అహ్మద్‌వైపే అధినేత్రి చూసేవారు. కీలకాంశాల్లో పార్టీలో ఏకాభిప్రాయం సాధించే చతురుడుగా పటేల్‌ పేరుగాంచారు. ఏపీకి అన్ని పార్టీల్లో దోస్తులు, అభిమానులు ఉన్నారు. మూడు నెలల క్రితమే పార్టీలో తలెత్తబోయిన ఒక తిరుగుబాటును సైతం ఆయన చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు.

పటేల్‌ ప్రస్థానం
1949 ఆగస్టులో జన్మించిన పటేల్‌ రాజకీయ ప్రస్థానం గుజరాత్‌లోని భరూచా జిల్లాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మొదలైంది. 1977లో 28ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993 లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీకి ఆయన సన్నిహితుడు. అప్పట్లో ప్రధానికి పార్లమెంట్‌ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా వ్యవహరించారు. 1992నుంచి మంత్రిగా ఆయన ఎప్పుడూ పదవీ బాధ్యతలు నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్‌ తరఫున కీలక నిర్ణయాలు తీసుకునే అతికొద్దిమందిలో ఆయన ఒకరు. పటేల్‌కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు