సుప్రీం కోర్టు సీనియర్‌ లాయర్‌ ఫాలీ నారీమన్‌ కన్నుమూత

21 Feb, 2024 12:36 IST|Sakshi

ఢిల్లీ, సాక్షి: న్యాయ రంగంలో ఒక శకం ముగిసింది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ (95) ఇక లేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ (బుధవారం) ఉదయం కన్నుమూశారు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. బాంబే హైకోర్టులో 22 ఏళ్లపాటు ప్రాక్టీస్‌ చేసిన ఆయన.. 1971 నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో పని చేస్తూ వచ్చారు. అలాగే..  1991 నుంచి 2010 వరకు బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. 

అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై గుర్తింపు పొందిన న్యాయనిపుణుడు ఫాలీ నారీమన్‌. న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

బ్రిటిష్‌ బర్మా రంగూన్‌లో 1929లో జన్మించారాయన. షిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం కోసం సివిల్స్‌ ఎగ్జామ్స్‌ వైపు అడుగులేసిన ఆయన.. చివరకు ఆర్థిక స్తోమత సహకరించక న్యాయవాద వృత్తి వైపు అడుగులేశారు. 


భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ నారిమన్‌ కీలక పాత్ర పోషించారు. అలాగే.. 1972 నుంచి మూడేళ్లపాటు అదనపు సోలిసిటర్‌ జనరల్‌గానూ పని చేశారు. అయితే.. ఎమర్జెన్సీ కారణంగా ఆయన రాజీనామా చేశారు. ఇక..  భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ తరఫున వాదించారు నారిమన్‌. అయితే అది పొరపాటని తర్వాత ఇంటర్వ్యూలలో ఆయన పేర్కొన్నారు. గోలఖ్‌నాథ్‌, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేషన్‌ లాంటి కేసుల్ని ఆయన వాదించారు. సుప్రీం కోర్టు ఏవోఆర్‌ కేసును సైతం (ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి..) ఈయనే వాదించారు. 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు వినిపించి ఆమెకు బెయిల్‌ ఇప్పించారు. నారీమన్‌ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి
సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ కన్నుమూత పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారీమన్‌ కుటుంబ సభ్యులకు సీఎం జగన్‌ సంతాపం తెలిపినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు