నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు

1 Dec, 2022 12:37 IST|Sakshi

న్యూఢిల్లీ: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్‌ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా ఢిల్లీలో మకాం వేసిన శ్రీనివాస్‌ సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అంటూ మోసాలు చేస్తున్నట్లు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. సీబీఐ, ఈడీ కేసులను సెటిల్‌మెంట్లు చేయిస్తానని వసూళ్లు చేసినట్లు తెలిపింది. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్‌ భవన్‌లను అడ్డగా చేసుకొని ఈ దందాలకు పాల్పడినట్లు వెల్లడించింది.

తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీలో పనులు చక్కబెట్టి కోట్లలో రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే నకిలీ అధికారిపై పలు కేసులు నమోదు కాగా.. ఏపీసీ 419, 420 కింద కేసులు నమోదు చేసింది. గత నెల 26న సీబీఐ ఏసీబీ వింగ్‌ శ్రీనివాస్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.
చదవండి: సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల

సీబీఐ సీనియర్ ఆఫీసర్‌నని చెప్పి యూసుఫ్ గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడిని మోసం‌ చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీలో‌ వినయ్ హాండా కుమారుడికి సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు పేర్కొంది.  మార్గానా వెంకటేశ్వర రావు, రవికి చెందిన 2000 వాహనాలను ఢిల్లీలో నో ఎంట్రీ స్థలంలోకీ అనుమతించేలా పోలీసులతో మాట్లాడాతానని పైసలు వసూలు చేసినట్లు వెల్లడించింది. పనులు చేయడానికి ప్రభుత్వ అధికారులకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలంటూ బాధితుల వద్ద భారీ ఎత్తున డబ్బు దండుకున్నట్లు తెలిపింది.

కాగా సీబీఐ అధికారిగా చలామణీ అవుతూ పనులు చేయిస్తానని చెప్పి అనేకమంది దగ్గర డబ్బులు దండుకుంటున్న శ్రీనివాస్‌ని మూడు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని చినవాల్తేరు కిర్లంపూడికి కు చెందిన ఇతన్ని ఢిల్లీలోని తమిళనాడు భవన్‌ల్‌ సీబీఐ అధికారులు అతుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్‌ అధికారినని, సీబీఐ ప్రధాన కార్యాలయంలో అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతుండటంతో అధికారులు అతన్ని పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు