జూన్‌ కల్లా మరో వ్యాక్సిన్‌

31 Jan, 2021 04:52 IST|Sakshi

ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌

న్యూఢిల్లీ: కోవిడ్‌–19ను నిలువరించే కోవోవ్యాక్స్‌ అనే మరో టీకాను వచ్చే జూన్‌కల్లా అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)ప్రకటించింది. ట్రయల్స్‌ ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేశామని ఎస్‌ఐఐ సీఈవో అధర్‌ పూనావాలా శనివారం ట్విట్టర్‌లో తెలిపారు. నోవావ్యాక్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందన్నారు. 2021 జూన్‌ కల్లా ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ– ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకాను ఎస్‌ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్‌ టీకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్రం 1.1 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ టీకాను ఎస్‌ఐఐ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్‌ నాటికి నాలుగైదు కోట్ల నోవావ్యాక్స్‌ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని ఇటీవలే పూనావాలా ప్రకటించారు.

35 లక్షల మందికి కోవిడ్‌ టీకా
ఆరోగ్య సిబ్బంది కోసం ప్రారంభించిన దేశవ్యాప్త కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌లో ఇప్పటి వరకు 35 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5.70 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 4,63,793 మంది, రాజస్తాన్‌లో 3,24,973 మంది, కర్ణాటకలో 3,07,891 మంది, మహారాష్ట్రలో 2,61,320 మంది లబ్ధిదారులు ఉన్నారంది. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ కోసం 63,687 సెషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు 1.7 లక్షలకు తగ్గిపోయాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.58% మాత్రమేనని వెల్లడించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు