రాష్ట్రాలకు రూ.400లకు డోసు

22 Apr, 2021 05:28 IST|Sakshi

ప్రైవేటు ఆసుపత్రులకు డోసుకు రూ.600

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధరలను ప్రకటించిన సీరమ్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు, పుణేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) తమ కరోనా వ్యాక్సిన్‌ ’కోవిషీల్డ్‌’బహిరంగ మార్కెట్‌ ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.400 డోసు చొప్పున అందజేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు ఒక డోసుకు రూ.600 వసూలు చేస్తామని వెల్లడించింది. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాగా, కేంద్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు, 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాల్లో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటిలాగే తక్కువ ధరకు అందిస్తూ... మిగతా 50 శాతం వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, సంస్థలకు అమ్ముకోవడానికి వీలు కల్పించింది. అయితే ఫార్మా కంపెనీలు మే1 లోపే పారదర్శకంగా తమ బహిరంగ మార్కెట్‌ ధరలను ప్రకటించాలని కేంద్రం షరతు విధించింది. కేంద్ర అదేశాలకు అనుగుణంగా సీరమ్‌ కోవిషీల్డ్‌ ధరలను ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 డోసు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 డోసు చొప్పున అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల ధరలను దృష్టిలో పెట్టుకొని... వాటితో పోల్చితే తక్కువ ధర ఉండేలా, అందరికీ అందుబాటులో ఉండేలా కోవిషీల్డ్‌ ధరలను నిర్ణయించాం. అమెరికా వ్యాక్సిన్లు బహిరంగ మార్కెట్లో ఒక్క డోసుకు రూ.1,500 కంటే ఎక్కువగా, రష్యా, చైనా వ్యాక్సిన్లు ప్రతి డోసుకు రూ.750కి పైగా ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరఫరాను పెంచుతాం. నాలుగైదు నెలల తర్వాత వ్యాక్సిన్‌ రిటైల్‌ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది’అని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వివరించింది.

కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కార్యక్రమాన్ని ఇకపై కూడా కొనసాగించనుంది. 18–45 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు వేసే విషయం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసుకోదలచుకున్న వారు నేరుగా వెళ్లి ఆసుపత్రి నిర్ధారించిన ఫీజు చెల్లించి వేసుకోవచ్చు. గతంలో 45 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం తరఫున టీకాలు సరఫరా అయ్యాయి కాబట్టి... ప్రైవేటులో వేసుకుంటే టీకాకు రూ. 150, సర్వీసు ఛార్జీ కింద రూ.100 వసూలు చేసుకోవడానికి అనుమతించారు. ఇప్పుడు సీరమ్‌ డోసును రూ.600లకు అమ్మనుంది. దీనిపై ప్రైవేటు ఆసుపత్రులు ఎంత అదనంగా వసూలు చేస్తాయనేది చూడాలి.  

కాంట్రాక్టు ముగిశాక కేంద్రానికీ అదే ధర
కేంద్ర ప్రభుత్వానికి రూ.150 డోసు చొప్పున అందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.400 ధర నిర్ణయించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇంత అధికధర వసూలు చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాయి. వైరస్‌ సమర్థత ఎంత ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియకముందే, చాలాకాలం ముందే కేంద్ర ప్రభుత్వం గంపగుత్తగా తమకు 10 కోట్ల డోసులకు అర్డర్‌ ఇచ్చిందని, రిస్క్‌ను తాము కూడా పంచుకొనే దాంట్లో భాగంగానే రూ.150 డోసును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించామని సీరం సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. ఈ పది కోట్ల డోసుల సరఫరా పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి కూడా రూ.400 డోసు చొప్పునే ఇస్తామన్నారు. ప్రస్తుతం నెలకు 6–7 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నామని, జులై కల్లా దీన్ని 10 కోట్ల డోసులకు పెంచుతామన్నారు. 

మరిన్ని వార్తలు