భారత్‌లో కొవొవాక్స్‌ ప్రయోగాలు షురూ

28 Mar, 2021 04:44 IST|Sakshi
సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా

సెప్టెంబర్‌కల్లా అందుబాటులోకి వ్యాక్సిన్‌

అదార్‌ పూనావాలా వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కొవొవాక్స్‌ ప్రయోగాలు ప్రారంభమైనట్టుగా సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా వెల్లడించారు. అమెరికా వ్యాక్సిన్‌ కంపెనీ నొవవాక్స్‌ భాగస్వామ్యంతో కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సెప్టెంబర్‌ నాటికి  ఈ వ్యాక్సిన్‌ ప్రజంలందరికీ అందుబాటులోకి వస్తుందని ట్వీట్‌ చేశారు. ఈ వ్యాక్సిన్‌ను యూకేలో పరీక్షించగా 89.3శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడైంది. దక్షిణాఫ్రికా, యూకే వేరియెంట్‌లను టీకా సమర్థంగా ఎదుర్కోగలదు.  గత ఏడాది ఆగస్టులోనే నొవావాక్స్, ఎస్‌ఐఐ వ్యాక్సిన్‌ తయారీ, అమ్మకాలకు సంబంధించి ఒక అంగీకారానికి వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఇప్పటికే తయారు చేస్తున్న సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఇప్పుడు కొవొవాక్స్‌ ఉత్పత్తిని కూడా చేపట్టనుంది. కరోనాపై పోరాటంలో భారత్‌ ఇతర దేశాలకు కూడా అండగా ఉంటూ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు పంపిణీ చేస్తోంది.

విదేశాలకే ఎక్కువ వ్యాక్సిన్లు
భారత్‌లో ప్రజలకి వేసిన కరోనా వ్యాక్సిన్ల కంటే ఎక్కువ మొత్తంలో టీకా డోసులు విదేశాలకు పంపిణీ చేసినట్టుగా ఐక్యరాజ్యసమితిలో డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్‌ చెప్పారు. ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్‌ అసమానతలు యూఎన్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని ఐరాససర్వ ప్రతినిధి సభలో ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ నిరుపేద దేశా>లకు కూడా అందాలన్న యూఎన్‌ రాజకీయ డిక్లరేషన్‌కు భారత్‌ కూడా మద్దతు పలికింది. ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ సవాళ్లను అధిగమించగలమని వ్యాక్సిన్‌ లభ్యత, అందుబాటులో ధర, పంపిణీ, నిరుపేద దేశాలకు కూడా పంపేలా సహకారం భారత్‌ బాగా ఇస్తోందని వివరించారు. భారత్‌ 70కిపైగా దేశాలకు  కోవిడ్‌ వ్యాక్సిన్‌లను పంపిణీ చేస్తోంది.
 

మరిన్ని వార్తలు