ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్

10 Sep, 2020 14:29 IST|Sakshi

 సీరంకు డీసీజీఐ షోకాజ్ నోటీసులు

నిలిచిన క్లినికల్ పరీక్షలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్ పై తాజా పరిణామాలు నీళ్లు చల్లాయి.ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరీక్షల్లో సమస్యల కారణంగా కొన్ని దేశాల్లో తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. దీంతో మన దేశంలో కూడా క్లినికల్‌ పరీక్షలకు బ్రేక్ పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా సమస్యల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులకు వరకు పరీక్షలను  నిలిపి వేయాల్సిందిగా  డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరంను ఆదేశించింది.  (ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన)

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ ప్రయోగాలకు డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ  తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలవరకు నిలిపివేయాల్సిందిగా  ఆదేశించింది. ఈ మేరకు పూణేలోని సీరం  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసులిచ్చింది. ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ సమస్యలు, నిలిపివేతపై కేంద్ర లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేయలేదని వ్యాఖ్యానించింది. ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో దేశంలోని 17 సైట్లలో నిర్వహిస్తున్న దశ 2/3  ట్రయల్స్  నిలిచిపోయాయి. 

తాజా షో-కాజ్ నోటీసుపై స్పందించిన సీరం ఇప్పటివరకు ట్రయల్స్ పాజ్ చేయమని తమకు చెప్పలేదని పేర్కొంది. అయితే డీసీజీఐ జారీ చేసిన ఆదేశాలను అనుసరిస్తామని తెలిపింది. వారి సూచనలు, ప్రామాణిక ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా తుది దశ పరీక్షలలో భాగంగా బ్రిటన్‌లో ఒక వ్యక్తిపై ప్రయోగం సందర్భంగా సమస్యలు తలెత్తడంతో తాత్కాలికంగా నిలిపి వేసినట్టు బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా నిన్న(బధవారం) వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టిసారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు