కరోనా వ్యాక్సిన్‌పై వార్‌..!

30 Nov, 2020 04:46 IST|Sakshi

టీకాతో దుష్ప్రభావాలు.. నాకు రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలి: చెన్నైలో వ్యాక్సిన్‌ వలంటీర్‌

తప్పుడు ఆరోపణలు: సీఐఐ

విచారణ చేస్తాం: డీసీజీఐ

న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్‌’తో ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్‌ ఫిర్యాదు చేశారు. టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని  ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు.

ఇందుకు పరిహారంగా తనకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 5 కోట్ల పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్‌’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ) క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్‌ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్‌ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌’లో ఆ వలంటీరుకు టీకా వేశారు.

టీకా వలంటీరుగా పనిచేసిన ఆ 40 ఏళ్ల వ్యాపార వేత్త తరఫున ఒక న్యాయ సేవల సంస్థ ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ), కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, ఆస్ట్రా జెనెకా సీఈఓ.. తదితరులకు లీగల్‌ నోటీసులు పంపించింది.

ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని తన క్లయింట్‌కు ఇచ్చిన సమాచార పత్రంలో పేర్కొన్నారని, అందువల్లనే ఆయన వలంటీరుగా చేరేందుకు అంగీకరించారని ఆ సంస్థ వివరించింది. టీకా తీసుకున్న 10 రోజుల తరువాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆసుపత్రిలో చేర్చారని తెలిపింది. మాట్లాడలేకపోవడం, ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం.. తదితర సమస్యలు తలెత్తాయని, ఆ తరువాత  ఐసీయూలో చేర్చి చికిత్స అందించారని వలంటీరుగా పనిచేసిన వ్యక్తి భార్య వివరించారు.

100కోట్లకు దావా : సీఐఐ
ఈ ఆరోపణలను ఆదివారం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నష్ట పరిహారం కోరుతూ రూ. 100 కోట్లకు దావా వేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ ప్రయోగానికి, ఆ వలంటీరు అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తన అనారోగ్య సమస్యలకు టీకాను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. కాగా, టీకా దుష్ప్రభావాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని డీసీజీఐ పేర్కొంది.

డీసీజీఐతో పాటు టీకా వేసిన సంస్థలోని ఎథిక్స్‌ కమిటీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో చోటు చేసుకునే టీకా దుష్ప్రభావాలపై.. ముఖ్యంగా దుష్ప్రభావాలకు, టీకాకు ఉన్న సంబంధంపై క్షుణ్నంగా, శాస్త్రీయంగా పరిశోధన జరుగుతుందని ఐసీఎంఆర్‌లో ఎపిడెమాలజీ అండ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ హెడ్‌ డాక్టర్‌ సమీరన్‌ పాండా చెప్పారు. హడావుడిగా విచారణ జరిపి, ఒక అంచనాకు రావడం సరికాదన్నారు.  

మరిన్ని వార్తలు