స్టాలిన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. ఆరెస్సెస్‌కు భారీ ఊరట

4 Nov, 2022 19:04 IST|Sakshi

చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌కు మద్రాస్‌ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమిళనాడు వ్యాప్తంగా నవంబర్‌ 6వ తేదీన తలపెట్టిన కవాతులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం ఈ ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. 

తొలుత మొత్తం 50 ప్రదేశాల్లో కవాతులను నిర్వహించాలని ఆరెస్సెస్‌ భావించింది. అయితే స్టాలిన్‌ సర్కార్‌ మాత్రం కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే ఊరేగింపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆరెస్సెస్‌, హైకోర్టును ఆశ్రయించగా..  షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది హైకోర్టు. సున్నిత ప్రాంతాలుగా పేరున్న కొయంబత్తూర్‌, పొల్లాచ్చి, నాగర్‌కోయిల్‌తో పాటు మరో మూడు ప్రాంతాల్లో కవాతులకు అనుమతి ఇవ్వలేదు. ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని లేనితరుణంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరెస్సెస్‌కు ముందస్తుగా తెలిపింది మద్రాస్‌ హైకోర్టు. 

ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలలో మార్చ్‌ నిర్వహణలకు ప్రతికూలంగా ఏమీ లేదని తేల్చిచెప్పిన కోర్టు.. రెండు నెలల తర్వాత ఆ ఆరు ప్రదేశాల్లోనూ మార్చ్‌ నిర్వహించుకోవచ్చని ఆర్‌ఎస్‌ఎస్‌కు తెలిపింది. వాస్తవానికి.. అక్టోబరు 2న ఊరేగింపులకు కోర్టు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది.

మరోవైపు కొయంబత్తూర్‌లో ఇటీవలె కారు పేలుడు ఘటన.. ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓ ఇస్లామిక్‌ రాజకీయ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. వీటికి కారణాలుగా చూపుతూ..  శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చనే ఆందోళన హైకోర్టులో వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం.

ఇదీ చదవండి:  పట్టపగలే శివసేన నేత దారుణ హత్య

మరిన్ని వార్తలు