యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో  ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు..

24 Apr, 2023 19:18 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మాపియా, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే యూపీ పోలీసులు తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందినవారు. హత్య, బెదిరింపులు, భూ కబ్జాలు వంటి తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారు. 

ఈ లిస్టులో టాప్‌లో ఉన్న వారిలో  డాన్‌ నుంచి పొలిటీషియన్‌గా మారిన ముఖ్తర్ అన్సారీ, విజయ్ మిశ్రా, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హాజి యాకూబ్‌ ఖురేషి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజి ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ ద్వివేది, సుధీర్ సింగ్, దిలీప్ విశ్రా ఉన్నారు.

కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా నేర చరిత్ర ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్‌ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 66 మంది నేరగాళ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వీరిపై ఉన్న కేసులు త్వరగా విచారణ పూర్తయ్యేలా చూసి కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు.

ఈ 66 మందిలో అతీక్ అహ్మద్,  అదిత్య రాణా ఇప్పటికే చనిపోయారని, 27 మంది జైలులో ఉన్నారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కొందరిపై రూ.లక్షకుపైగా రివార్డు కూడా ఉన్నట్లు వివరించారు.
చదవండి: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట..

మరిన్ని వార్తలు