వైరల్‌: ఏడేళ్ల బాలుడి లైవ్‌ రిపోర్టింగ్‌.. సీఎం అభినందన

11 Aug, 2021 19:31 IST|Sakshi

ఇంఫాల్: టీవీ జర్నలిస్టులు లైవ్‌ రిపోర్టింగ్‌లో భాగంగా సభలు, సమావేశాలు, పలు వేడుకలకు సంబంధించిన సమాచారాన్ని అప్పటికప్పుడు మాట్లాడుతూ వీక్షకులకు అందిస్తారు. అయితే కొంత మంది తమ ప్రత్యేకమైన శైలిలో రిపోర్టింగ్‌ చేసి  ఆకట్టుకుంటారు. అచ్చం టీవీ రిపోర్టర్‌ మాదిరిగా.. మణీపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బిరెన్‌ సింగ్‌కు సంబంధించిన ఓ కార్యక్రమాన్ని ఏడేళ్ల ఓ  బాలుడు లైవ్‌ రిపోర్టింగ్‌ చేశాడు. బాలుడి రిపోర్టింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మంగళవారం ముఖ్యమంత్రి ఎన్‌. బిరెన్‌ సింగ్‌ మణీపూర్‌ పర్యటించి సేనాపతి జిల్లా ఆస్పత్రిలో ఆక్సీజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అయితే  సీఎం పర్యటన, ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రాంరంభోత్సవాన్ని ఓ బాలుడు భవనం మీది నుంచి వీడియోలో మాట్లాడుతూ వివరించాడు. ‘టీవీ రిపోర్టు మాదిరిగా కెమెరా వైపు చూస్తూ.. ఈ రోజు మనం రాష్ట్ర సీఎం కింద కనిపిస్తున్న స్థలంలో హెలికాప్టర్‌లో దిగటం చేస్తున్నాము. మీకు హెలికాప్టర్‌ కనిపించడం లేదు కాదా.. చూపిస్తాం. సీఎం జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. కోవిడ్‌ను నియంత్రించడంలో ఇదో ముందడుగు’ అని చక్కగా మాట్లాడుతూ వివరించాడు. అనంతరం సీఎం హెలికాప్టర్‌ టేకాఫ్ అవుతుండగా చూపిస్తూ.. ‘మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.. సీఎం ఎన్‌ బిరెన్‌ జీ. చాలా గర్వంగా ఉంది. మీరు మళ్లి రావాలని కోరుకుంటున్నాం’ అంటు మాట్లాడాడు. 

అదే విధంగా కాసేపట్లో హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతుందని, అందుకు సిద్ధంగా ఉందని చెబుతూ.. హెలికాప్టర్‌ గాల్లోకి ఎగరటంతో ఈలలు వేస్తూ టాటా చెబుతాడు. ఆ బాలుడు చేసిన రిపోర్టింగ్‌ వీడియోను మణీపూర్‌ సీఎం ఎన్‌ బిరెన్‌ సింగ్‌.. తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి బాలుడిని అభినందించారు. ‘బాలుడైన నా స్నేహితుడిని చూడండి. అతను నేను మంగళవారం సేనాపతి జిల్లాలోని ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభించిన కార్యకమాన్ని చాలా చక్కగా రిపోర్టింగ్‌ చేశాడు’ అని కాప్షన్‌ రాశారు. దీంతో బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ‘ సూపర్! నిజమైన రిపోర్టర్‌ వలె చేశావు’.. ‘చాలా బాగా చేశాడు.. బాలుడిలో మంచి రిపోర్టింగ్‌ నైపుణ్యం ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు