West Bengal: మింగేసిన మెరుపు వరద

7 Oct, 2022 07:58 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం మాల్‌ నదిలో దిగిన భక్తులను ఆకస్మిక వరద కబళించింది. జల్‌పాయ్‌గురి జిల్లాలో బుధవారం రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చిన్నపాటి ప్రవాహం, బురదమయమైన మాల్‌ నది ఒడ్డున దాదాపు 70 మంది స్థానికులు దుర్గామాత విగ్రహంతో చేరుకున్నారు. లోపలికి వెళ్లి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నది ప్రవాహం ఉధృతమైంది.

అందరూ అప్రమత్తమై ఒడ్డుకు చేరుకునేలోపే ప్రవాహం మహోగ్రంగా మారింది. దీంతో దాదాపు 80 మంది కొట్టుకుపోసాగారు. ఒడ్డున ఉన్న యువత, వలంటీర్లు దాదాపు 70 మందికిపైగా భక్తులను కాపాడారు. ఎనిమిది మంది ప్రవాహంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని జాతీయసహాయక నిధి నుంచి మృతుల కుటుంబాలకు చెరో రూ.2 లక్షల సాయం ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సైతం మృతులకు చెరో రూ.2లక్షల సాయం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు