పిడుగులు పడి ఒకే రోజు 9 మంది మృతి.. ఇద్దరికి గాయాలు!

7 Aug, 2022 14:43 IST|Sakshi

భోపాల్‌: పిడుగులు పడి మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. విదిశా, సట్నా, గుణా జిల్లాల్లో పిడుగులు పడి ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సైతం భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 

చెట్టుకింద నిలుచోవటమే శాపంగా మారింది..
విదిశా జిల్లాలోని అగసోడ్‌ గ్రామంలో శనివారం సాయంత్రం వర్షం వస్తుందని నలుగురు ఓ చెట్టుకింద తలదాచుకున్నారు. అయితే.. అదే చెట్టుపై పిడుగు పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోనే జరిగినట్లు సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కున్వర్‌ సింగ్‌ ముకటి తెలిపారు. మృతులు గాలు మాలవియా, రాము, గుడ్డా, ప్రభు లాల్‌గా గుర్తించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సింగ్ తెలిపారు.  సట్నా జిల్లాలోని పోడి పతౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం సాయంత్రం పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అంజన, చంద్రా, రాజ్‌కుమార్‌, రామ్‌కుమార్‌ యాదవ్‌గా గుర్తించారు. గుణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.

ఇదీ చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్‌లు.. కసాయి తల్లిపై విచారణ

మరిన్ని వార్తలు