మళ్లీ విజృంభిస్తున్న కరోనా..పలువురు మంత్రులకు పాజిటివ్‌

19 Feb, 2021 16:11 IST|Sakshi

ముంబై : ఒకప్పుడు మహారాష్ట్రను గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు అక్కడ తిరిగి విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు సహా మంత్రులు కరోన బారిన పడ్డారు. తాజాగా ఆరోగ్య శాఖ ఇన్‌చార్జ్‌ రాజేష్‌ తోపేతో సహా మంత్రులు జయంత్‌ పాటిల్‌, రక్షా ఖాడ్సే, రాజేంద్ర షింగ్నేలతో పాటు మరి కొందరు నేతలకు కరోనా సోకింది.  మంత్రి ఓంప్రకాష్ బాబారావు తనకు రెండోసారి కరోనా సోకినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఈ మధ్యకాలంలో తనని కలిసిన వారందరూ కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. మరో మంత్రి జయంత్ ఆర్ పాటిల్ సైతం తాను కరోనా బారిన పడినట్లు ట్వీట్‌  చేశారు. కాగా ఈయన ఇటీవలె శరద్‌ పవార్‌ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో పాల్గొనడంతో మిగతా కేబినెట్‌ సభ్యులకు కరోనా భయం పట్టుకుంది. 

ఇటీవల కాలంలో ప్రజల్లో కరోనా పట్ల పెద్దగా భయం లేకపోవడం, జాగ్రత్తలు పాటించకపోవడంతో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తుందని అధికారులు తెలిపారు.  కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామన్న భావన ప్రజల్లో నెలకొందని,  ఫలితంగా కరోనా జాగ్రత్తలు పాటించడంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవరించిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్రలో ప్రతిరోజూ 3,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. తొలివారంతో పోలిస్తే 14 శాతం అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి 3వేలకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి.

బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 4787 కొత్త కోవిడ్‌ కేసులు నమోదు కాగా, గురువారం 5వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ముంబై, పుణే నుంచి అత్యధికంగా వస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నాగపూర్, థానె, అమరావతి పట్టణాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్కసారిగా కరోనా కేసులు  పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలను కఠినతరం చేసి, వాటిని ఉల్లంఘించినవారి చర్యలు తీసుకోవాలని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గురువారం నిర్ణయించింది.

చదవండి :
సీఎం హెచ్చరిక.. మరోసారి లాక్‌డౌన్‌ దిశగా..?

ఒకే అపార్టుమెంటులో 103 మందికి కరోనా


 

మరిన్ని వార్తలు