గుడ్‌న్యూస్‌.. అందుబాటు ధరల్లోకి క్యాన్సర్‌ మందులు

14 Sep, 2022 07:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యాంటీ క్యాన్సర్‌ డ్రగ్స్, యాంటీ బయోటిక్స్‌ సహా 34 డ్రగ్స్‌ను జాతీయ అత్యావశ్యక ఔషధాల జాబితా(ఎన్‌ఎల్‌ఈఎం)లోకి కేంద్రంచేర్చింది. దాంతో వీటి ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు 384 జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం విడుదల చేశారు.

ఐవర్‌మెక్టిన్, అమికాసిన్, బెడాక్లిలైన్, డెలామనిడ్, ముపిరోసిన్, మెరోపెనెమ్‌ వంటివి వీటిలో ఉన్నాయి. బెండామస్టీన్‌ హైడ్రోక్లోరైడ్, ఇరినోటెకాన్‌ హెచ్‌సీఐ ట్రైహైడ్రేడ్, లెనాలిడోమైడ్, లియూప్రోలైడ్‌ ఎసిటేట్‌ వంటి యాంటీ క్యాన్సర్‌ డ్రగ్స్, నికోటిన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ, బుప్రినోరిఫెన్‌ వంటి మానసిక చికిత్స ఔషధాలనూ జాబితాలో చేర్చారు. ర్యాంటిడిన్, సుక్రాల్ఫేట్, వైట్‌ పెట్రోలియం, ఎటినోలోల్, మెథైల్‌డోపా సహా 26 డ్రగ్స్‌ను తొలగించారు.

1996 నుంచి ఈ జాబితాను కేంద్రం అమలుచేస్తోంది. 2003, 2011, 2015ల్లో దీన్ని సవరించారు. ఆరోగ్య సంరక్షణలో అన్ని స్థాయిల్లోనూ సరసమైన, నాణ్యమైన ఔషధాల ప్రాధాన్యాన్ని నిర్ధారించడంలో ఎన్‌ఎల్‌ఈఎంది పెద్ద పాత్ర అని మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. ఎండోక్రైన్‌ మెడిసిన్, కాంట్రాసెప్టివ్స్‌ ఫుడ్రోకార్టిసోన్, ఓర్లీలోక్సిఫిన్, ఇన్సులిన్‌ గ్లార్జైన్, టెనిలిగ్లిటిన్, శ్వాస వ్యవస్థ సంబంధ మోంటేలూకాస్ట్, నేత్ర సంబంధ లాటనోప్రోస్ట్‌లనూ జాబితాలో చేర్చారు.

384 ఔషధాలు NLEM, 2022లో 34 ఔషధాల జోడింపుతో చోటు దక్కించుకున్నాయి. ఈ మొత్తం ఔషధాలను 27 చికిత్సా విభాగాలుగా వర్గీకరించారు.

ఇదీ చదవండి: క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్‌ చేంజర్‌

మరిన్ని వార్తలు