ప్రాణాలు పోతున్నా... ఏమీ చేయలేకపోతున్నాం

25 Apr, 2021 04:18 IST|Sakshi

ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలంటూ వీడియోలు 

సెకండ్‌ వేవ్‌లో వైద్యుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి  

రేయింబవళ్లు నిద్రాహారాలు మానుకొని పని పని పని.. మండు వేసవిలో శరీరాన్ని పీపీఈ కిట్లతో బంధించి కోవిడ్‌ రోగులకు చికిత్స అందివ్వాలి. కళ్లముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. సెకండ్‌ వేవ్‌ వచ్చేసరికి భారత్‌లో వైద్యులు శారీరకంగా అలసిపోతున్నారు. మానసికంగా ఆందోళనకు లోనవుతున్నారు. కన్నీరు కారుస్తూ ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైద్యులు పెడుతున్న పోస్టులు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అవేంటో చూద్దాం..   

సూపర్‌ హీరోలం అనుకోవద్దు 
మేము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. బాధతో హృదయం ముక్కలవుతోంది. 34 ఏళ్ల యువకుడు వెంటిలేటర్‌ మీద చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. పరిస్థితి మా చేతులు కూడా దాటేస్తోంది. అందుకే అందరూ మాస్కు తప్పనిసరిగా వేసుకోండి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి 
– డాక్టర్‌ తృప్తి గిలాడా, ముంబై

నా ఫోన్‌ రింగ్‌ ఆగడం లేదు 
ప్రతీ అయిదు నిముషాలకు ఒకసారి నా ఫోన్‌ రింగ్‌ అవుతూనే ఉంటుంది. ఆసపత్రిలో బెడ్స్‌ కోసం పేషెంట్లు నిరంతరం కాంటాక్ట్‌ చేస్తూనే ఉంటారు. వారు దీనంగా బెడ్‌ కోసం అడుగుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలీడం లేదు. ముంబైలో బెడ్స్‌ ఖాళీ లేవు. అందుకే ఆస్పత్రి అవసరం రాకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్‌ పింటో, ముంబై

ముందు జాగ్రత్తలు లేవు 
కరోనా ఫస్ట్‌ వేవ్‌కి, సెకండ్‌వేవ్‌కి మధ్య కొంత సమయం దొరికింది. అయినా ప్రభుత్వాలు, ప్రజలు కూడా సన్నద్ధతపై దృష్టి పెట్టలేదు. ఢిల్లీ కూడా మరో మహారాష్ట్రలా మారడానికి ఎన్నో రోజులు పట్టదు. ప్రభుత్వాల అలసత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కళ్ల ముందే కోవిడ్‌ రోగులు ఊపిరాడక మరణిస్తూ ఉంటే తట్టుకోవడం కష్టంగా ఉంది 
– డాక్టర్‌ రేష్మా తివారి బసు, గుర్‌గావ్‌  

ప్రాణాలు పోతున్నా... ఏమీ చేయలేకపోతున్నాం 
నా కెరీర్‌ మొత్తంలో ఇలాంటి దుస్థితి చూడలేదు. కళ్ల ముందే ఆక్సిజన్‌ లేక రోగులు ప్రాణాలొదిలేస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నాం. మేమూ మనుషులమే మాకూ భావోద్వేగాలుంటాయి. శారీరకంగా, మానసికంగా అలిసిపోతున్నాం. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్‌.. అందరూ మాస్కులు వేసుకోండి.  
– డాక్టర్‌ దీప్‌శిఖ ఘోష్, ముంబై  

అందరం కలిసి నిరసనకు దిగుదాం 
దేశవ్యాప్తంగా భారీ జనసందోహం హాజరవుతున్న సమావేశాలకు వ్యతిరేకంగా మనందం నిరసనకు దిగుదాం. డాక్టర్లు, నర్సుల అసోసియన్లు అందరూ కలిసి రండి. మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోతోంది. కేసులు సునామీలా ముంచేస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు. 
– డాక్టర్‌ పారల్‌ ఎం శర్మ, ఢిల్లీ 

మరిన్ని వార్తలు