మోదీ కూడా నా కుమారుడే.. భయమెందుకు

25 Sep, 2020 13:16 IST|Sakshi

టైమ్స్‌ మ్యాగ్‌జైన్‌ జాబితాపై బిల్కిస్‌ దాదీ స్పందన

సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది టైమ్‌ మ్యాగజైన్‌ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేం‍ద్ర మోదీ సహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల వయసున్న బామ్మ బిల్కిస్‌ దాదీ టైమ్‌ జాబితాలో స్థానం పొందారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీని తన కొడుకుగా భావిస్తానని.. ఆయన ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్లి కలుస్తానని తెలిపారు. షాహిన్‌బాగ్‌ దాదీగా పేరు సంపాదించిన బిల్కిస్‌ గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా 100 రోజుల పాటు రేయింబవళ్లు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఒక చేత్తో జపమాల, మరో చేత్తో జాతీయ జెండా పట్టుకొని అణగారిన వర్గాల గళంగా బిల్కిస్‌ నిలిచారు. మహిళలు, మైనార్టీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. పొద్దున్నే 8కల్లా ఠంచనుగా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు. (చదవండి: మోదీ, షాహిన్‌బాగ్‌ దాదీ)

ఈ క్రమంలో ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ‘ఒకవేళ మోదీ మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆయనని కలవడానికి వెళతారా అని ప్రశ్నిస్తే.. ఎందుకు వెళ్లను. తప్పక వెళ్తాను. ఇందులో భయపడటానికి ఏం ఉంది. తను నా కుమారుడిలాంటి వాడు. నేను తనకు జన్మనివ్వకపోవచ్చు. మరో సోదరి ఆ పని చేసింది. అయినా తను నా బిడ్డలాంటి వాడే’ అన్నారు. అంతేకాక ఈ జాబితాలో మోదీ పేరు కూడా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానని.. ఆయనను అభినందిస్తున్నాను అని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం తమ మొదటి పోరాట కరోనా మహమ్మారి మీద అని స్పష్టం చేశారు దాదీ. ఇక మార్చి 24 నుంచి షాహీన్‌ బాగ్‌ నిరసన స్థలం క్లియర్‌ చేయబడింది. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగింది. 

మరిన్ని వార్తలు