మేం జోక్యం చేసుకోం.. ‘షాహీన్‌ బాగ్‌’ కూల్చివేతలపై స్టే పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

9 May, 2022 15:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: షాహీన్‌ బాగ్‌ కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కూల్చివేత అంశంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవడం మేలని పిటిషనర్లకు సూచించింది. 

ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ అధికారులు షాహీన్‌ బాగ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత కోసం బుల్డోజర్లతో చేరుకున్నారు. పెద్ద ఎత్తున్న చేరుకున్న స్థానికులు అధికారుల్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు బుల్డోజర్‌కు అడ్డుగా వెళ్లడంతో.. అధికారులు కూల్చివేతలకు పాల్పడకుండానే వెనుదిగారని సమాచారం. ఇక ఈ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ సీపీఎం, సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ వేసింది. 

అయితే.. పిటిషన్‌ను బాధితులు కాకుండా.. ఒక రాజకీయ పార్టీ వేయడమేంటని? సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయాలకు అత్యున్నత న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని తీవ్రంగా మందలించింది. ఆపై పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. 

గతంలో జహంగీర్‌పురి కూల్చివేతల ఘటన సమయంలోనూ ఇదే తరహాలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. తక్షణమే స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కూల్చివేతపై స్టే విధించిన సంగతి తెలిసిందే. షాహీన్‌ బాగ్‌.. సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక నిరసనలకు వేదికగా నిలిచింది. అయితే.. కరోనా టైంలో ఆ వేదికను ఖాళీ చేయించారు పోలీసులు.

చదవండి: షాహీన్‌ బాగ్‌లో బుల్డోజర్లు.. స్థానికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత

మరిన్ని వార్తలు