వ్యాక్సిన్‌ తొలి ప్రయోగం నామీదే : కేంద్రమంత్రి

13 Sep, 2020 19:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ కంట్రోల్‌కి రాకపోవడంతో వ్యాక్సిన్‌ తయారీ మరింత వేగవంతమైంది. ఇప్పటికే చాలా జౌషద సంస్థలు రెండోదశ ప్రయోగాలను పూర్తి చేసుకుని మూడో స్టేజ్‌కు ప్రవేశించాయి. ఇక భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో వైరస్‌ వ్యాప్తి, వాక్సిన్‌ తయారీపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరోనా విరుగుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వైరస్‌పై పోరులో ముందుండి ప్రజలను రక్షిస్తున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి తొలుత వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. (భారీ రికవరీ, అంతకుమించి కేసులు)

అయితే ప్రయోగాల అనంతరం తొలి వ్యాక్సిన్‌ తీసుకోవాడానికి ఎవరూ ముందుకు రాకపోతే తానే స్వయంగా వ్యాక్సిన్‌ను వేసుకుంటానని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. టీకాపై ప్రజలకు మరింత భరోసా కల్పించడానికి తొలి ప్రయోగంగా తాను అందుబాటులో ఉంటానన్నారు. ఇక ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి భారత్‌లో చాలావరకు తక్కవగా ఉందన్నారు. అంతేకాకుండా రికరీ రేటు కూడా పెద్ద ఎత్తున ఉందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ సోషల్‌ మీడియా వేదికగా ‘సండే సంవాద్‌’ అనే కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. (పార్లమెంట్‌లో కరోనా కలకలం..!)

దేశంలో వైరస్‌ వెలుగుచూసిన మొదట్లో కనీసం పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవని, ఇతర దేశాల నుంచి దిగువతి చేసుకున్న పరిస్థితి ఉందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్వదేశంలో తయారు చేసిన కిట్లనే వాడుతున్నామని చెప్పారు. కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 97,570 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు వెలుగుచూసిన కేసుల సంఖ్య  46,59,984 కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం పరీక్షల సంఖ్య 5,62,60,928 చేరుకుంది. 


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా