ఈ షాలూ.. మస్తు చాల్‌.. తెలుసా!

27 Mar, 2021 18:48 IST|Sakshi

హోలా.. మర్‌హబా.. నిహావో.. సలూట్‌.. ఓయ్‌.. స్వస్ది.. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా..? పలు విదేశీ భాషల్లో నమస్కారం అని అర్థం. ఈ ఫొటోలో ఉన్న బొమ్మ చూశారా.. ఇదో రోబో.. పేరు ‘షాలు’. ‘సోఫియా’రోబో తెలుసు కదా.. అచ్చు అలాంటిదే ఇది. ఈ షాలు దాదాపు 38 విదేశీ భాషలు మాట్లాడగలదు. భారత్‌లోని దాదాపు 9 భాషల్లో మాట్లాడుతుందట. ఈ రోబోను తయారు చేసింది దినేశ్‌పటేల్‌ అనే కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన దినేశ్‌ పటేల్‌ ఐఐటీ బాంబేలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. రజనీకాంత్‌ ‘రోబో’ సినిమా స్ఫూర్తితో ఈ రోబోను తయారు చేశాడట.

పైగా ఈ రోబోను పూర్తిగా ప్లాస్టిక్, అల్యూమినియం, కార్డుబోర్డు వంటి వ్యర్థ పదార్థాలతో తయారుచేశాడు. ఈ రోబో వ్యక్తులను గుర్తుపట్టడంతో పాటు, భావోద్వేగాలు వ్యక్తపరచడం, వార్తాపత్రికలు చదవడం తదితర కార్యకలాపాలు చేస్తుందని దినేశ్‌ చెబుతున్నాడు. ఈ రోబోను స్కూల్‌ టీచర్‌గా కాని, రిసెప్షనిస్టుగా కానీ నియమించుకోవచ్చని పేర్కొంటున్నాడు. షాలు.. ఏకంగా 47 భాషల్లో (38 విదేశీ భాషలు, 9 స్థానిక భాషలు) మాట్లాడగలుగుతుందట. ఈ రోబో పలు భాషల్లో మాట్లాడుతుండగా వీడియోలు తీసి దినేశ్‌ ‘అప్నీ రోబో షాలు’అనే యూట్యూబ్‌ చానెల్‌లో పెడుతున్నాడు. దీంతో ఈ వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు