'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్ష ఎంపీ మిమిక్రి

19 Dec, 2023 15:51 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. 

లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ  ఇమిటేట్ చేశారు. ఇందుకు విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. ఆ దృశ్యాలను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఫోన్‌లో చిత్రీకరించారు.

విపక్షాల చర్యను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఖండించారు. కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయాలని పిలుపునిచ్చారు. సభ గౌరవ మర్యాదలను కాపాడకుండా, సభాధ్యక్షునిపై హేళనగా ప్రవర్తించిన ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరారు. 

డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్‌ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం సృష్టించడంతో ఇప్పటివరకు 141 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి: లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు

>
మరిన్ని వార్తలు