బీజేపీపై పోరాటానికి కాంగ్రెస్‌లోకి వస్తానని ప్రకటన

3 Feb, 2021 20:23 IST|Sakshi

గాంధీనగర్‌‌: దేశవ్యాప్తంగా కుదేలై చచ్చి బతుకుతున్న కాంగ్రెస్‌ పార్టీ కొంత ఊరట కల్పించే పరిణామం చోటుచేసుకోనుంది. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన్నే స్వయంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం వస్తుందని గుజరాత్‌లో చర్చ నడుస్తోంది. ఆయన రాకతో హస్తం పార్టీలో జోష్‌ రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన శంకర్‌ సిన్హా వాఘేలా త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తనను కాంగ్రెస్‌లో చేరాలని ఇటీవల కార్యకర్తలు, అభిమానులు విజ్ఞప్తులు చేస్తున్నారని.. ఎక్కడకు వెళ్లినా అదే ప్రస్తావన వస్తోందని వివరించారు. ఎలాంటి షరతుల్లేకుండా హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

2017లో కాంగ్రెస్‌ పార్టీని వీడిన వాఘేలా రెండేళ్ల తర్వాత ఎన్సీపీలో చేరారు. ఆ తర్వాత విబేధాలు రావడంతో 2020లో బయటకు వచ్చి ప్రజాశక్తి డెమోక్రటిక్‌ పార్టీ (పీఎస్‌డీపీ) స్థాపించారు. ఆయన రాజకీయ జీవితం బీజేపీతోనే. 1995లో తనను కాదని కేశుభాయ్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిగా చేయడంతో వాఘేలా బీజేపీలో చీలిక తీసుకొచ్చారు. 1996లో కాంగ్రెస్‌ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటుచేసి శంకర్‌ సిన్హా వాఘేలా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయి మన్మోహన్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్‌లోకి రానున్నట్లు ప్రకటించారు. 

అయితే తాను కాంగ్రెస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో చెప్పారు. గతేడాది అహ్మద్‌ పటేల్‌ అంత్యక్రియలకు హాజరైన సమయంలో తనను కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తిరిగి పార్టీలోకి రావాలని కన్నీళ్లు పెట్టుకుని అడిగారని వాఘేలా ఆ ప్రకటనలో తెలిపారు. అయితే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీపై ప్రస్తుతం పోరాటం చేస్తానని శంకర్‌ సిన్హా చెప్పారు. సోనియా, రాహుల్‌గాంధీతో సమావేశమైన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటానని ఎనిమిది పదుల వయసులో ఉన్న వాఘేలా ప్రకటన చేశారు.

మరిన్ని వార్తలు