యూపీఏకు పవార్‌ సారథ్యం?

11 Dec, 2020 01:58 IST|Sakshi

రైతుల ఆందోళనల అంశంలో క్రియాశీలకంగా మారిన పవార్‌

మహారాష్ట్ర తరహాలో విపక్షాలను ఏకం చేసే సామర్థ్యం

యూపీఏ బాధ్యతల నుంచి సోనియా వైదొలగే అవకాశం

ఆ తర్వాత యూపీఏ సారథి ఎంపికపై ఊహాగానాలు

సాక్షి, న్యూఢిల్లీ: మరాఠా రాజకీయ యోధుడు శరద్‌ పవార్‌ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో శరద్‌ పవార్‌ విపక్ష బృందానికి సారథ్యం వహించి బుధవారం రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ముందు రైతుల అభ్యంతరాల అధ్యయనం, విపక్షాలను ఏకం చేసేందుకు పవార్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. శరద్‌ పవార్‌ నివాసంలో రైతుల సమస్యలపై విపక్ష నాయకులతో సమావేశాలు సైతం జరిగాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రపతితో భేటీ తర్వాత యూపీఏ అధ్యక్ష బాధ్యతల మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.  

ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు?
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మారారు. అయితే, వయోభారం కారణంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకొనేందుకు, యూపీఏ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, త్వరలోనే ఆ బాధ్యతలను అనుభవం కలిగిన నేతకు అప్పగించాలని చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో సోనియా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ, యూపీఏ చైర్‌పర్సన్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కొనసాగారు.

ఈసారి మాత్రం ఆమె రాజకీయాలకే రిటైర్మెంట్‌ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సోనియాగాంధీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుభవజ్ఞుడైన, అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపగల చైర్‌పర్సన్‌ అవసరమని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన శరద్‌ పవార్, సోనియా గాంధీ తర్వాత తదుపరి యూపీఏ చైర్‌పర్సన్‌గా ఎంపిక విషయంలో ముందు వరుసలో ఉన్నారు. యూపీఏ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే విషయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌ వంటి ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ, రాజకీయంగా వారు ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి.  

పవార్‌ ఎందుకంటే..
ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్‌ పవార్‌కు దాదాపు అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగే స్వభావం ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి షాకిచ్చి ఎన్‌సీపీ–శివసేన–కాంగ్రెస్‌ కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవార్‌ కీలక పాత్ర పోషించారు. రాజకీయ సూత్రధారిగా కూడా శరద్‌ పవార్‌ ఏడాదిగా సక్సెస్‌ అయ్యారు. ఇతర రాజకీయ పార్టీలతో కలుపుకొని ముందుకెళ్ళే స్వభావం, యూపీఏ చీఫ్‌గా పొత్తులను నిర్వహించేటప్పుడు కీలకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్‌గాంధీతో మాట్లాడేందుకే ఇష్టపడని మమతా బెనర్జీతో పోలిస్తే, పవార్‌ వ్యవహార శైలి కారణంగా పొత్తు రాజకీయాలు కష్టం కాకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు.

అదంతా ఒట్టిదే: ఎన్‌సీపీ
ముంబై: సోనియాగాంధీ వైదొలిగితే యూపీఏ సారథ్య బాధ్యతలను తమ నేత శరద్‌ పవార్‌ చేపట్టే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఎన్‌సీపీ ఖండించింది. అవన్నీ మీడియా ఊహాగానాలేనని ఎన్‌సీపీ ప్రతినిధి మహేశ్‌ తపసే కొట్టిపారేశారు.  ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, కొందరి స్వార్థం కోసం ఇటువంటి నిరాధార అంశాలను మీడియా బయటకు తెస్తోందని ఆయన ఆరోపించారు.  శరద్‌ పవార్‌(80) జాతీయ స్థాయి పాత్ర సైతం పోషించగల సమర్థులు, జనం నాడి తెలిసిన వ్యక్తి అని శివసేన పేర్కొంది.

మరిన్ని వార్తలు