ప్రధానితో పవార్‌ భేటీ

18 Jul, 2021 02:35 IST|Sakshi

గంటసేపు చర్చలు

జాతీయ ప్రయోజనాలపైనేనన్న ఎన్‌సీపీ అధినేత

న్యూఢిల్లీ: నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇరువురు నేతలు దాదాపుగా గంట సేపు చర్చలు జరిపారు. ప్రధాని కార్యాలయం వారిద్దరి ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ‘‘రాజ్యసభ ఎంపీ శరద్‌ పవార్‌ ప్రధానిని కలుసుకున్నారు’’  అన్న వాక్యం మినహాయించి వారిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలను ఆ ట్వీట్‌లో  ప్రస్తావించలేదు. మరోవైపు పవార్‌ తన ట్వీట్‌లో  ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నాను. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించాను’’ అని పేర్కొన్నారు.

సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పవార్‌ ప్రధానిని కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా పేరున్న పవార్‌ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన వ్యక్తి . శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చీలికలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ అంశాల్లో కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్ర చీఫ్‌ నానా పటోల్‌ తరచూ శివసేన, ఎన్‌సీపీపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో పవార్‌ నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన ప్రధానిని కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

ప్రధానికి పవార్‌ లేఖాస్త్రం
ప్రధానిని కలుసుకోవడమే కాకుండా పవార్‌ శనివారం మోదీకి ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసి హోం మంత్రి అమిత్‌ షాకి బాధ్యతలు అప్పగించిన సహకార మంత్రిత్వ శాఖపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సహకార బ్యాంకింగ్‌ వ్యవస్థలన్నీ రాష్ట్రాల జాబితాలో ఉన్నాయని, కేంద్రంలో ఇందులో ఏ విధంగా జోక్యం చేసుకున్నప్పటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పవార్‌ ఆ లేఖరో పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ చట్ట సవరణల్ని గురించి ప్రస్తావించారు.  కోఆపరేటివ్‌ ప్రిన్సిపల్స్‌ మేరకే కేంద్రం నడుచుకోవాలన్నారు. సహకార వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.  ‘‘చాలా రోజులుగా పవార్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అది ఇవాళ సాధ్యమైంది. బ్యాంకింగ్‌ సెక్టార్‌ అంశంలో మేము చేసిన విజ్ఞప్తిని ప్రధాని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం’’ అని ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు