పవార్‌కు షాక్‌? NCP జాతీయ పార్టీ హోదాను ఈసీ రద్దు చేయనుందా!

21 Mar, 2023 18:26 IST|Sakshi

న్యూఢిల్లీ: సీనియర్‌ పొలిటీషియన్‌ శరద్‌ పవార్‌కు షాక్‌ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైందా?. ఆయన స్థాపించిన  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ)కి ఉన్న జాతీయ పార్టీ హోదాను పునఃపరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. జాతీయ హోదా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది.  

తాజాగా ఈ అంశంపై ఎన్‌సీపీ నుంచి ప్రతినిధి వివరణ కోరింది ఈసీ. ఒకవేళ ఎన్‌సీపీ ప్రతినిధి ఇచ్చిన వివరణను.. ఈసీ  అంగీకరించని పక్షంలో పవార్‌ పార్టీకి షాక్‌ తగలనుంది.  జాతీయ పార్టీ హోదాను కోల్పోతుంది ఎన్‌సీపీ. అప్పుడు అది ఒక ప్రాంతీయ పార్టీగానే.. వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందంతే. 

జాతీయ పార్టీ హోదా కారణాంగా.. అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పలు రాష్ట్రాలలో పార్టీకి ఉమ్మడి గుర్తు, న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలంతో పాటు ఎన్నికల సమయంలో ఉచితంగా పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌లలో ప్రసార సమయం లభిస్తాయి.

ఎన్నికల సంఘం 2016లో రాజకీయ పార్టీల జాతీయ పార్టీ హోదా స్థితిని సమీక్షించే విధానాన్ని సవరించింది. అప్పటిదాకా ఐదు సంవత్సరాలకొకసారి సమీక్షిస్తుండగా.. దానిని ప్రతి 10 సంవత్సరాలకు సమీక్షించేలా రూల్స్‌ మార్చింది. 

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఎన్సీపీతో పాటు సీపీఐ, టీఎంసీల జాతీయ పార్టీ హోదా వ్యవహారం ఎన్నికల సంఘం ముందు సమీక్షకు వచ్చింది. అయితే అప్పటి నుంచి వరుసగా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో..  యథాతథ స్థితిని కొనసాగించాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పుడు ఆ అంశమే మళ్లీ తెర మీదకు వచ్చింది. 

సింబల్స్‌ ఆర్డర్‌ 1968 ప్రకారం.. జాతీయ హోదాను కోల్పోయిన పార్టీకి దేశవ్యాప్తంగా ఉమ్మడి గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదు. 

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ.. 1999 జూన్‌ 10వ తేదీన ఆవిర్భవించింది. శరద్‌ పవార్‌, పీఏ సంగ్మా, తారీఖ్‌ అన్వర్‌లు ఈ పార్టీ వ్యవస్థాపకులు. సోనియా గాంధీ ఇటలీ మూలాలను ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్‌ నేతలైనా ఈ ముగ్గురు తిరుగుబావుటా ఎగరేయడంతో పార్టీ వీళ్లను బహిష్కరించింది. ఆపై వీళ్లు ఎన్‌సీపీని స్థాపించగా.. అటుపై ఇండియన్‌ కాంగ్రెస్‌(సోషలిస్ట్‌)-శరత్‌ చంద్ర సిన్హా పార్టీ, ఎన్‌సీపీలో విలీనం అయ్యింది. మహారాష్ట్రలో ఎన్‌సీపీ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అలారం క్లాక్‌ ఈ పార్టీ గుర్తు. త్రివర్ణ పతాకం మధ్యలో అలారం క్లాక్‌.. పార్టీ జెండాగా ఉంది. జాతీయ స్థాయిలో యూపీఏతో పొత్తు నడిపించిన ఈ పార్టీ.. కేరళలో ఎల్‌డీఎఫ్‌Left Democratic Front, మహారాష్ట్రలో Maha Vikas Aghadi కూటమి, యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, జార్ఖండ్‌లో మహాఘట్బంధన్‌, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో పొత్తు సాగిస్తోంది. 


ఒక పార్టీ.. రాష్ట్ర/ప్రాంతీయ పార్టీ గుర్తింపు ఉండాలంటే..
ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలి. లేదంటే లోక్‌సభ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో 6 శాతం ఓట్లు, ఒక ఎంపీ సీటు సాధించాలి. లేకుంటే.. గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో కనీసం మూడు శాతం సీట్లు లేదా మూడు సీట్లు(ఏది ఎక్కువగా అయితే అది)గెలవాల్సి ఉంటుంది. ఇది కాకుంటే.. అసెంబ్లీ లేదా లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీ కనీసం 8 శాతం ఓట్లు పొందాలి. ఇలా ఈసీ రూల్స్‌ ప్రకారం.. ఆ పార్టీ రాష్ట్ర/ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.

మరి జాతీయ పార్టీ గుర్తింపు కోసం.. 
రాష్ట్రంలో క్రియశీలంగా ఉన్న పార్టీ.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే.. ఎన్నికల సంఘం పరిధిలోని అర్హతలను అందుకోవాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి. లేదంటే.. దేశంలోని కనీసం మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ 2 శాతం చొప్పున ఓట్లు పొందాలి. కుదరకుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో(అసెంబ్లీ లేదా లోక్‌సభ) నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి కనీసం 4 ఎంపీ సీట్లు సాధించాలి. 

దేశంలో ప్రస్తుతం 8 జాతీయ పార్టీలు 

1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

2. భారతీయ జనతా పార్టీ

3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - సీపీఐ

4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) - సీపీఎం

5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ( నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది కాబట్టి జాతీయ పార్టీగా అవతరించింది)

6. బహుజన్ సమాజ్‌ పార్టీ

7. నేషనలిస్ట్ కాంగ్రెస్

8. నేషనల్ పీపుల్స్ పార్టీ

ఇదీ చదవండి: సీల్డ్‌ కవర్‌ సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం కామెంట్లు ఇవి!

మరిన్ని వార్తలు