కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్‌ ఎవరికంటే..

20 Sep, 2022 07:34 IST|Sakshi

న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నాన్‌-గాంధీ కుటుంబం వ్యక్తికి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించే సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్‌ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ నిర్ణయించుకున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని ఆమె ముందుంచారు. ‘మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు’ అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. 

అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా సరే.. తాను వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని చెప్పారంటున్నారు. భేటీ వివరాలను మీడియాకు వెల్లడించేందుకు థరూర్‌ నిరాకరించారు. ‘‘పోటీ చేయాలనుకునే నేతలందరికీ స్వాగతం. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో పాల్గొనేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కూడా అన్నారు. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్‌ ప్రకటించడం తెలిసిందే. పార్టీలో అంతర్గత సంస్కరణల దిశగా ఆయన కొంతకాలంగా గట్టిగా గళం వినిపస్తున్నారు. వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ బాగా డీలా పడుతూ వస్తోంది. 

ఈ నేపథ్యంలో పార్టీకి అత్యవసరమైన పలు విప్లవాత్మక మార్పులకు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ శ్రీకారం చుడుతుందని మలయాళ దినపత్రిక మాతృభూమికి రాసిన వ్యాసంలో థరూర్‌ అభిప్రాయపడ్డారు. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడంతో పాటు ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను అమలు చేస్తామని అధ్యక్ష అభ్యర్థులు ప్రమాణం చేయాలంటూ పలువురు యువ నేతలు, కార్యకర్తల చేసిన విజ్ఞాపనను ఆయన ట్విట్టర్లో షేర్‌ చేశారు. ‘‘దీనిపై 650 మందికి పైగా సంతకం చేశారు. ఈ విజ్ఞాపనను స్వాగతిస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళించాలంటూ లేఖ రాసి జీ–23గా పేరుపడ్డ కాంగ్రెస్‌ అసంతృప్త నేతల్లో థరూర్‌ కూడా ఉన్నారు.
 
రాజస్తాన్‌ పగ్గాలు పైలట్‌కు? 
మరోవైపు రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పటికే ఖాయమైంది. దేవీ నవరాత్రులు మొదలయ్యాక సెపె్టంబర్‌ 26న ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. నామినేషన్ల దాఖలుకు 30వ తేదీ తుది గడువు. అక్టోబర్‌ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు వెల్లడవుతాయి. గెహ్లాట్‌ నెగ్గి పార్టీ పగ్గాలు చేపడితే సచిన్‌ పైలట్‌ను రాజస్తాన్‌ సీఎంగా నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాహుల్‌గాంధీయే మళ్లీ అధ్యక్షుడు కావాలంటూ ఆరు పీసీసీ కమిటీలు తీర్మానం చేశాయి.

ఇదీ చదవండి: నగదు విరాళాలు రూ.2,000 మించొద్దు

మరిన్ని వార్తలు