నాకున్న ఫాలోయింగ్‌ మీకు తెలియట్లేదు.. నా పవర్‌ ఆరోజు తెలుస్తుంది: శశిథరూర్‌

26 Sep, 2022 15:16 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీలో కోల్డ్‌ వార్‌ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీని టెన్షన్‌కు గురిచేస్తోంది. హస్తం పార్టీ చీఫ్‌ రేసులో రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, కేరళ ఎంపీ శశిథరూర్‌ ఉన్న విషయం తెలిసిందే. కాగా, వీరిలో ఎవరికి మెజార్టీ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

అయితే, కాంగ్రెస్‌ చీఫ్‌ రేసులో ఉన్న శశిథరూర్‌ మరోసారి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. సోమవారం శశిథరూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నాకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మద్దతు ఉంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నేను నామినేషన్‌ దాఖలు చేసే నాకు ఉన్న ఫాలోయింగ్‌ మీరే చూస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మెజార్టీ నేతలు నేను పోటీ చేయాలని ఇప్పటికే కోరారు. ఈ విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను ప్రజలకు సైతం కలుస్తాను అని కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ కేరళలో ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీని శశిథరూర్‌ కలిశారు. ఈ విషయంపై శశిథరూర్‌ స్పందిస్తూ.. రాహుల్‌ గాంధీ పాలక్కడ్‌లోని పట్టంబిలో భారత్‌ జోడో యాత్రలో ఉన్నారు. పాలక్కడ్‌ నా సొంత జిల్లా.. రాహుల్‌ ఇక్కడ ఉన్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశాను అని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి  శ‌శిథ‌రూర్ ఈ నెల 30న‌ నామినేష‌న్ దాఖ‌లు చేయనున్నారు. ఏ వ్య‌క్తి అయినా.. జాతీయ‌ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డాలంటే.. ఆ అభ్య‌ర్థి పేరును దేశంలోని 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్ర‌తిపాదించాలి.  కాగా.. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎంపీ శశిథరూర్‌, రాజస్థాన్ సీఎం  అశోక్‌ గెహ్లాట్‌ల‌కు పార్టీ అధిష్టానం ఇప్ప‌టికే  ఆమోదం తెలిపింది. నామినేషన్ల దాఖలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్న‌ది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8న చివరి తేదీ, అక్టోబర్ 17న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న వెల్లడికానున్నాయి. 

ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేతను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం ఇది నాలుగోసారి. దాదాపు 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఓటింగ్‌ జరుగుతోంది. చివరిసారిగా 2000 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత్రి, జితేంద్ర ప్రసాద్‌ పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో సోనియా విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు