ఖర్గేకు మద్దతు ప్రకటన.. గెహ్లాట్‌పై చర్యలకు శశిథరూర్‌ డిమాండ్‌

15 Oct, 2022 12:14 IST|Sakshi

భోపాల్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌పై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు‌. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి, సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా గెహ్లాట్‌ తన ట్విటర్‌లో ఈమధ్య ఓ వీడియో సందేశం ఉంచారు. ఈ క్రమంలో ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై థరూర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అభ్యర్థులు ఎవరైనా సరే..అంటూ మొదలుపెట్టి గెహ్లాట్‌ ప్రసంగం కొనసాగింది. ‘‘ఖర్గే పార్టీ నేతలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రతిపక్ష నేతలతోనూ చర్చించగల సామర్థ్యం ఉంది. కాబట్టి, పార్టీ ప్రతినిధులంతా ఆయన్ని ఘనమైన మెజార్జీతో గెలిపించాలి’’ అని గెహ్లాట్‌ సదరు వీడియో సందేశంలో కోరారు.  ఈ పరిణామంపై గురువారం భోపాల్‌(మధ్యప్రదేశ్‌) పార్టీ కార్యాలయంలో శశిథరూర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.  పార్టీ ఆఫీస్‌ బేరర్‌గానీ, ముఖ్యమంత్రిగానీ,  పీసీసీ చీఫ్‌లు గానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడంగానీ, మద్దతు తెలపడం లాంటి పనులు గానీ చేయకూడదు. 

అలాంటిది గెహ్లాట్‌ బహిరంగంగా ఖర్గేకు మద్దతు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై పక్షపాతం ప్రదర్శించకుండా దర్యాప్తు చేయాలి. అలాగే గెహ్లాట్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’’ అని థరూర్‌ పేర్కొన్నారు.

చాలా చోట్లా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, బడా నేతలు మల్లికార్జున ఖర్గేకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆ కార్యక్రమాలకు కార్యకర్తలను రమ్మంటూ పిలుస్తున్నారు. ఆయనతో కూర్చుని.. చాలాసేపు చర్చిస్తున్నారు. నా విషయంలో మాత్రం ఇది ఎందుకనో జరగడం లేదు అంటూ థరూర్‌ ఇంతకు ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎల్లుండి.. అంటే అక్టోబర్‌ 17 సోమవారం జరగనున్నాయి. మరోవైపు పార్టీ హైకమాండ్‌ మీద ధిక్కార స్వరం వినిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్న జీ23 నేతలు.. ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ సుస్థిరంగా మనుగడ సాగించాలంటే ఖర్గే పగ్గాలు అందుకోవాలని సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ సైతం స్పష్టం చేశారు. జీ–23 కూటమిలో శశిథరూర్‌ ఉన్నప్పటికీ..  ఖర్గేకే వాళ్లంతా జై కొట్టడం విశేషం.

ఇదీ చదవండి: చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు!

మరిన్ని వార్తలు