ఆమె ఆ బ్యాంకులో నాడు స్వీపర్‌గా నేడు మేనేజర్‌గా...

1 Aug, 2022 21:44 IST|Sakshi

మనకే చాలా కష్టాలు ఉన్నాయనుకుంటాం. పైగా నా వద్ద ఇది అది లేదు అందువల్లే సాధించలేకపోయాను అంటుంటారు. కానీ కొంతమంది ఎలాంటి సాయం లేక చూసుకునే వాళ్లు కూడా లేక అనాథలైనప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లని ఆదర్శంగా తీసుకోకుండా బాధపడుతూ ఉండిపోతాం. ఇక్కడొక మహిళ ఆ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసింది. మళ్లీ అదే బ్యాంకులో మేనేజర్‌గా అత్యన్నత హోదాను పొందింది. అదెలా సాధ్యమైందంటే...

వివరాల్లోకెళ్తే....ప్రతీక్ష అనే మహిళ 1964లో పూణేలోని ఒక నిరుపేద తల్లిదండ్రులకు జన్మించింది. ఆమెకు 16 ఏళ్ల వయసులోనే సదాశివ కడు అనే వ్యక్తికి ఇ‍చ్చి పెళ్లి చేసేశారు. దీంతో ఆమె పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేసింది. ఆమె భర్త ఎస్‌బీఐ బ్యాంకులో బుక్‌ బైండర్‌గా పనిచేసేవాడు. పెళ్లైన ఏడాదికి ఆ జంటకు ఒక మగబిడ్డ జన్మించాడు. వారు ఒకరోజు వారి బంధువుల గ్రామానికి వెళ్తుండగా సదాశివ ఒక ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆమె 20 ఏళ్లకే వితంతువుగా మారిపోతుంది.

పైగా బిడ్డ పోషణ భారం ప్రతీక్షపై పడిపోతుంది. తన భర్త పనిచేసే బ్యాంకు వద్దకు వెళ్లి తనకు సాయం చేయమని వేడుకుంది. దీంతో వారు ఆ బ్యాంకులో ఆమెకు స్వీపర్‌గా ఒక ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు ఆమె ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులను చూసి తాను ఆ స్థాయికి చేరాలనుకుంది. కానీ తాను కనీసం పది వరకు కూడా చదువుకోలేదు కాబ‍ట్టి ఎలా ఉద్యోగం సంపాదించగలను అని మదనపడింది. పైగా తన సంపాదన తన బిడ్డ ఆకలి తీర్చడానికి కూడా సరిపోయేది కాదు.

ఏం చేయాలో తోచేది కాదు. కానీ ఏదోరకంగా టెన్త్‌ పాసవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంది ప్రతీక్ష. బంధువులు, స్నేహితు సాయంతో పుస్తకాలు కొనుక్కుని చదువుకుని మరీ టెన్త్‌ పాసైంది. బ్యాంకు ఉద్యోగం సాధించాలంలే ఇంటర్మీడియెట్‌ కూడా పాసవ్వాలి. పైగా తాను కాలేజ్‌కి వెళ్తే కొడుకుని చూసుకోవడం కష్టమైపోతుంది. ఎలా అనుకుంటుండగా తనను బ్యాంక్‌ పరీక్షలు రాయమని ప్రోత్సహిస్తున్న ప్రమోద్ తోండ్‌వాల్కర్‌ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది.

దీంతో అతను తన ఇంటిని, కొడుకు ఆలనాపాలనను చూసుకోవడంతో ప్రతీక్షకు సగం కష్టం తగ్గినట్లు అనిపిస్తుంది. ఇక ఆమె పగలంతా పనిచేస్తూ రాత్రిళ్లు నైట్‌ కాలేజ్‌లకి వెళ్తుండేది. అలా ప్రతీక్ష ఇంటర్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాంకు పరీక్షలు రాసి క్లర్క్‌గా తొలి ఉద్యోగాన్ని సంపాదించింది. ఆ తర్వాత 2004లో ట్రైనీ ఆఫీసర్‌గా పదోన్నతి పొంది పలు ఉన్నత పదవులను చేపట్టింది. తదనంతరం ఆమె అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ హోదాకు చేరుకుంది. కష్టాల కడలిని ఈది అనుకున్నది సాధించేంత వరకు వదలని ప్రతీక్షలాంటి వాళ్లు ఎంతమందికో ఆదర్శం. ఆమె మరో రెండేళ్లలో రిటైర్‌ అవునుంది.

(చదవండి:  పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు)

మరిన్ని వార్తలు