నాన్న వస్తాడని ఎదురుచూస్తోంది.. బతికిలేరన్న నిజం తెలిస్తే!

9 Jun, 2021 09:17 IST|Sakshi

ఓ తల్లి భావోద్వేగం

హరిద్వార్‌: కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను తలకిందులు చేసింది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మనిషిని మాయదారి రోగానికి కోల్పోతే ఆ బాధను వర్ణించడం కష్టం. అలాంటి వారిలో కెప్టెన్‌ హరీష్‌ తివారి ఒకరు.. కరోనాతో పోరాడుతూ ఇటీవలే ప్రాణాలు కోల్పోయారు. నాన్నపై పంచ ప్రాణాలు పెట్టుకున్న ఆ కూతురు.. నాన్న వస్తాడనే ఆశతో ఎదురుచూస్తుంది.. కానీ నాన్న రాడన్న విషయం తెలిస్తే ఆ చిన్ని గుండె ఏమవుతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది.

హరిద్వార్‌కు చెందిన హరీష్‌ తివారికి పైలట్‌ అవ్వాలని కోరిక బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచి విమానాలను నడపాలనే ఆకాంక్షతో ఏవియేషన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు కంప్లీట్‌ చేసి పైలట్‌ అయి కోరికను నెరవేర్చుకున్నారు. అలా 2016లో ఎయిర్‌ ఇండియాలో పైలట్‌గా జాయిన్‌ అయ్యారు. కొద్దిరోజుల్లోనే మంచి పేరు తెచ్చుకొని కెప్టెన్‌ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత మృదుస్మిత దాస్‌ అనే యువతితో వివాహం జరిగింది. మరుసటి సంవత్సరమే వారి జీవితంలో మహాలక్ష్మి అడుగుపెట్టింది. అలా జీవితం హాయిగా సాగిపోతున్న దశలో కరోనా ఆ కుటుంబాన్ని చిదిమేసింది.

హరీష్‌ కుటుంబం మొత్తం కరోనా బారీన పడింది.. వారి కూతురు తప్ప. అయితే కుటుంబం కోలుకున్నా.. హరీష్‌ మాత్రం ఆ మహమ్మారితో పోరాడుతూ పది రోజుల క్రితం కన్నుమూశారు. ఆయన కరోనాతో మృతి చెందడం.. హరీష్‌ తల్లిదండ్రులు వృద్దులు కావడంతో అతని భార్య మృదుస్మిత అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఐదేళ్ల కూతురికి నాన్న చనిపోయిన విషయం తెలియకపోవడంతో ఆసుపత్రిలో ఉ‍న్న నాన్న ఏ రోజైనా ఇంటికి వస్తాడని ఆశగా ఎదురుచూస్తుంది. 

ఇదే విషయమై మృదుస్మిత దాస్‌ మాట్లాడుతూ.. '' పది రోజుల క్రితం నా భర్త కరోనాతో కన్నుమూశారు.. ఆయనకు జరగాల్సిన అంత్యక్రియలు నేనే దగ్గరుండి పూర్తి చేశాను. నా ఐదేళ్ల కూతురికి ఆయన కరోనా బారీన పడ్డారన్న విషయం తెలుసు.. ఆసుపత్రిలో ఇంకా ఎన్నిరోజులు ఉంటారమ్మ అని అడుగుతుంది.ఆయన లేరన్న విషయం తెలిస్తే నా కూతురి పరిస్థితి ఏమవుతుందో.. హరీష్‌ తల్లిదండ్రులు రిటైర్డ్‌ ఉద్యోగులు.. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది..'' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. 

అయితే హరీష్‌ తివారి ఒక్కరే కాదు.. ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియాలో పనిచేస్తున్న 17 మంది పైలట్లు ఏడాది వ్యవధిలోనే కరోనాతో కన్నుమూశారు. అందులో 13 మంది ఫిబ్రవరి 2021 నుంచి మహమ్మారికి బలవ్వడం దురదృష్టకరం.
చదవండి: అయ్యో.. మళ్లీ రోడ్డు పక్కకే... ‘బాబా కా దాబా’ 

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు