నది దగ్గర తన పనిలో మునిగిన పాల వ్యాపారి.. కలెక్టర్‌ ఫొటోతో గుట్టు రట్టు

26 Jul, 2023 10:58 IST|Sakshi

నది దగ్గరకు వెళ్లి పాలలో నీళ్లు కలుపుతున్న పాల వ్యాపారికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను క్లిక్‌ మనిపించిన మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్‌ జిల్లా కలెక్టర్‌ దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఒక పాల వ్యాపారి ఒక నది దగ్గర నిలుచుని  పాల క్యాన్లలో నీటిని కలపడం కనిపిస్తుంది. ఈ ఫొటోను స్వయంగా కలెక్టర్‌ తన మొబైల్‌ ఫోనుతో క్లిక్‌ మనిపించారు. తరువాత దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, వైరల్‌ చేశారు. 

వివరాల్లోకి వెళితే శ్యోపూర్‌ పట్టణానికి  సమీపంలో ఉన్న మోర్‌డోంగరీ నది దగ్గరకు ఒక పాల వ్యాపారి తన బైక్‌కు పాల క్యాన్లను తగిలించుకుని వచ్చాడు. తరువాత ఒక క్యాన్‌లో నదిలోని నీటిని నింపి, ఆ నీటిని మిగిలిన పాల క్యాన్లలో నింపాడు. ఈ సమయంలో మార​‍్నింగ్‌ వాక్‌ చేస్తూ, అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఆ పాల వ్యాపారికి ఫొటో తీశారు. 

అనంతరం ఆ పాల వ్యాపారిని అడ్డుకుని, పాలలో నీటిని కలపవద్దంటూ మందలించి అక్కడి నుంచి పంపివేశారు. కలెక్టర్‌ చేసిన ఈ పనితో మిగిలిన పాల వ్యాపారులలో వణుకు పుట్టింది. సదరు పాల వ్యాపారి ఫోటోను కలెక్టర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన నేపధ్యంలో జనం రకకాలుగా స్పందిస్తున్నారు.

ఈ ఉదంతం గురించి కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ తాను మార్నింగ్‌ వాక్‌కు వెళుతుండగా డోంగరీ నది దగ్గర ఒక పాల వ్యాపారి పాల క్యాన్లలో నీటిని కలుపుతుండగా చూశానని అన్నారు. అతని దగ్గరకు వెళ్లి మందలించానని తెలిపారు. ఇప్పటీకీ పాల వ్యాపారులు తమ తీరుమార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: రోడ్డుపై సావధానంగా వెళ్లండి.. చక్కని సంగీతం వినండి.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు